ఎర్రన్న బాటలో ఎదురులేని ఫ్యామిలీ

కుటుంబం మొత్తం రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి అరుదైన రికార్డునే కింజారపు ఫ్యామిలీ సంపాదించింది. ప్రస్తుతం ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు ఎంపీగా ఈ ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ గాలి బలంగా వీచినా దాన్ని తట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున వారు ముగ్గురు గెలుపొందారు. వారే టెక్కలి నుంచి ఎమ్యెల్యేగా విజయం సాధించిన కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ గా గెలిచిన రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని. వైసీపీ గాలి ఎంత బలంగా వీచినా మీరు ఎన్నికల్లో విజయం సాధించడం వెనక దివంగత ఎర్రన్నాయుడు పేరుప్రఖ్యాతలు చాలానే ఉన్నాయి.


 అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు శ్రీకాకుళం ప్రజలకు ఎర్రన్నాయుడు పేరు గుర్తుకు వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా.. ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే ఆత్మీయుడిగా కింజారపు ఎర్రన్నాయుడు పేరుతెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఎర్రన్నాయుడు అప్పట్లో చక్రం తిప్పారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ... పార్టీలోనూ ప్రజల్లోనూ పలుకుబడిని పెంచుకున్నారు. ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా తీరని లోటు ఏర్పడింది. ఆయన భౌతికంగా లేకపోయినా.. ఆయన ప్రభావం మాత్రం ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యుల విషయంలో కనిపిస్తూ వస్తోంది.


 ఎర్రన్నాయుడు రాజకీయ వారసులుగా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నానాయుడు, ఆదిరెడ్డి భవాని ఇలా అంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు. అసెంబ్లీలోనూ బలమైన వాయిస్ ఇస్తూ అధికార పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడికి రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిక కూడా దక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా పార్లమెంటు లో ఏపీ సమస్యల గురించి ప్రస్తావిస్తూ నిధులను మంజూరు చేయాల్సిందిగా కోరుతూ అనేక సమస్యల మీద  అనర్గళంగా మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. 


ఇక ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని కూడా మొన్నటి ఎన్నికల్లో ఎమ్యెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడిప్పుడే ఆమె రాజకీయంగా తన ప్రసంగాలకు పదును పెడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎర్రన్నాయుడు ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ మారుమూల ప్రాంతం గా ఉన్న శ్రీకాకుళం జిల్లా కు ఎక్కడలేని కీర్తిని తీసుకొస్తున్నారు. వీరందరికీ ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది అంటే అది ఖచ్చితంగా దివంగత ఎర్రన్నాయుడు కి ప్రజల్లో ఉన్న ఆదరనే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: