అనుమతుల్లేని కాలేజీలపై చర్యలేవి..?

NAGARJUNA NAKKA

అనుమతులు లేకుండా కాలేజీలు ఎలా నడుస్తున్నాయి. అధికారులకు తెలియకుండానే, వారి అండదండలు లేకుండానే ఇన్నాళ్లు కాలేజీలు నడిచాయా.. కోర్టు జోక్యంతో కదిలిన యంత్రాంగం... ఇన్నేళ్లు ఎందుకు కళ్లు మూసుకొని కూర్చుంది. అనుమతులు లేకుండా నడుస్తున్న కాలేజీలపై చర్యలేవీ ? 

 

తెలంగాణలో 2 వేల 570 జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డ్ గుర్తింపు ఉంది. ఇందులో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 14 వందల 86 వరకూ ఉన్నాయి. వీటికి తోడు అనుమతి లేకుండా  కొన్ని జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ఇంటర్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం 79 కాలేజీలకు అనుమతులు లేవు. ఇందులో 68 జూనియర్ కళాశాలలకు ఫైర్ noc లేక పోవడంతో అనుమతులు మంజూరు చేయలేదని ఇంటర్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. మరి ఇన్నాళ్లు వాటిపై చర్యలెందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

చాలా కాలంగా అనుమతులు లేకుండానే కాలేజీలు నడుస్తున్నాయి. వీటిలో ప్రముఖ కార్పోరేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. నాలుగేళ్లుగా వాటికి ఇంటర్ బోర్డ్ అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదు. అయిన క్లాసులు నడిపిస్తున్నాయి. వాటిల్లో పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అయితే ఇన్నాళ్లుగా అధికారుల అండదండలు లేకుండానే కాలేజీలు నడుస్తున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రలోభాలకు ఆశపడి కొందరు అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకోర్టు సీరియస్ అవ్వడంతో ఇప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు...గతంలో ఎందుకు నోటీసులు ఇవ్వలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

విద్యార్థులను అడ్డం పెట్టుకొని అటు యాజమాన్యాలు ఇటు ఇంటర్ బోర్డ్ పబ్బం గడుపుకున్నాయి. అనుమతులు లేని కాలేజీల్లో 29 వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. వారందరికి  ప్రత్యామ్నాయం చూపెట్టలేమని ఇప్పటిదాకా బోర్డు అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని తప్పించుకోవచ్చన్న ధైర్యంతోనే యాజమాన్యాలు ...నిబంధనలు తుంగలో తొక్కాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: