హైదరాబాద్ వాసులకు శుభవార్త... ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం...!

Reddy P Rajasekhar

జీహెచ్ఎంసీ హైదరాబాద్ లో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం అన్నపూర్ణ భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం నగరంలో రోజుకు 35,000 నుండి 40,000 మంది పేదల ఆకలి తీరుస్తోంది. నిన్నటితో ఈ పథకానికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఎంతో మంది ఆకలి బాధలను తీరుస్తున్న ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. ఇకనుండి జీహెచ్ఎంసీ ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం అందించనుంది. 
 
అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఇళ్ల నుండి బయటకు రాలేని వృద్ధులు, వికలాంగులకు జీహెచ్ఎంసీ భోజనం అందించనుంది. నగరంలోని 5 జోన్లలో నిన్నటినుండి ఈ కొత్త స్కీమ్ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ప్రత్యేక డిజైన్లతో తయారు చేసిన ఆటోల ద్వారా ఇంటికెళ్లి భోజనం అందిస్తుంది. అధికారులు ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు వారి ఇంటి దగ్గరికి భోజనం చేరేలా ఏర్పాట్లు చేశారు. 
 
ఇందుకోసం ప్రత్యేకమైన లంచ్ బాక్సులను అధికారులు తయారు చేయించారు. లంచ్ బాక్సులో 4 డబ్బాలు ఉంటాయి. రెండు బాక్సుల్లో అన్నం, ఒక బాక్సులో కూర, ఒక బాక్సులో సాంబారు ఉంటుంది. జీహెచ్ఎంసీ ఈ కొత్త స్కీమ్ కోసం భారీగా ఖర్చవుతున్నా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా 5రూపాయలకే భోజనం అందిస్తోంది. అన్నపూర్ణ భోజన పథకం ప్రారంభంలో రోజుకు 1000 మంది కడుపు నింపగా ప్రస్తుతం రోజుకు 40,000 మంది ఆకలి తీరుస్తోంది. 
 
జీహెచ్ఎంసీ 2014లో ఒక్కపూటైనా పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. కడుపునిండా 5రూపాయలకే భోజనం పెడుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ పథకానికి గుర్తింపు లభించింది. జీహెచ్ఎంసీ నగరంలోని 150 ప్రాంతాల్లో 5రూపాయలకే భోజనం అందిస్తోంది. ఒక్కో భోజనం తయారీకి 24 రూపాయల 25 పైసలు ఖర్చవుతోంది. నగరంలో పేదలు, కూలీలు, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చే వారు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: