స్థానిక సమరానికి ఏపీ రెడీ.... సీఎం జగన్ కీలక ఆదేశాలు...!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సీఎం జగన్ హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం 50శాతానికి లోబడి రిజర్వేషన్లతో ఎన్నికలకు సిద్ధమవుతోందని సమాచారం. ఈరోజు జగన్ వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించి నెల రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ మొదటి వారం లోపు మున్సిపల్, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని జగన్ సంబంధిత అధికారులకు తెలిపారు. రేపు జరగనున్న కేబినేట్ సమావేశంలో స్థానిక ఎన్నికల గురించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. అధికారులు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. కేబినేట్ భేటీ అనంతరం జగన్ ఎన్నికల షెడ్యూల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
ప్రభుత్వం వీలైనంత త్వరగా రిజర్వేషన్లపై గెజిట్ విడుదల చేసి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుందని సమాచారం. మరోవైపు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు కూడా సిద్ధమవుతోంది. ఈ నెల మూడవ వారంలో శాసనసభను సమావేశపరచి తాత్కాలిక బడ్జెట్ ను ఆమోదింపజేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల కాలానికి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని, జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ కు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం.
ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చామని ఎన్నికల్లో డబ్బును, లిక్కర్ ను పూర్తిగా నిరోధించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ చేశారన్న ఆరోపణలు రాకూడదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్ ను అందుబాటులో ఉంచాలని జగన్ సూచించారు. ప్రజలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల వద్ద ఈ యాప్ ఉండాలని ఎలాంటి అక్రమం జరిగినా ఈ యాప్ లో వెంటనే నమోదు కావాలని చెప్పారు.