లోకేష్ కాన్వాయ్ పై చెప్పులు ? మొన్న బాబు ఇప్పుడు చినబాబు
కొద్దిరోజుల క్రితం అమరావతి ప్రాంత రైతులకు మద్దతు ఇచ్చేందుకు పార్టీ శ్రేణులతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు , ఆయన బృందంపై రాజధాని రైతులు కొంతమంది చెప్పులు విసరడం అది కాస్తా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో చినబాబు లోకేష్ కాన్వాయ్ పైనా చెప్పుల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన ఇప్పుడు టీడీపీలో కలవరం పుట్టిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గంలోని మునికోడలి గ్రామంలో పురుషోత్తపట్నం నిర్వాసితులకు, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.
ఈ సందర్భంగా అక్కడ పర్యటించేందుకు వచ్చిన లోకేష్ ను అడ్డుకునేందుకు ఆ ప్రాంతంలోని రైతులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మునికోడలిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్తున్న లోకేష్ ను పురుషోత్తపట్నం నిర్వాసితులు అడ్డుకున్నారు. వీరికి వైసిపి నాయకులు కూడా మద్దతు పలకడంతో పరిస్థితి అదుపు తప్పింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు విషయంలో టిడిపి కాంట్రాక్టర్ కి న్యాయం చేశారని, రైతులను నిలువునా ముంచారు అంటూ టీడీపీ నాయకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో అటుగా వచ్చిన లోకేష్ పై రైతులు చెప్పులు, కుర్చీలు విసిరారు. సీతానగరం మండలానికి టిడిపి ఏం చేసిందో చెప్పాలంటూ రైతులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. లోకేష్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులతో టిడిపి నాయకులు వాదనకు దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఎక్కడికక్కడ లోకేష్ పైనా, చంద్రబాబు పైనా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇలా వరుసగా ప్రజల నిరసనల సెగలు తగులుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఒక్కొక్కటీ బయటకి రావడం, ప్రజల ఆగ్రహం చవిచూడడం సర్వ సాధారణంగా మారింది.