పవన్ కళ్యాణ్ కు మరో షాక్... వైసీపీలో చేరిన జనసేన ముఖ్య నేత..!

Reddy P Rajasekhar

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  కొన్ని రోజుల క్రితం మరో ముఖ్య నేత జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా పార్టీని వీడిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య  వైసీపీలో చేరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. చేరిక అనంతరం వెంకట్రామయ్య మీడియాతో మాట్లాడారు. 
 
కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున వెంకట్రామయ్య పోటీ చేసి విజయం సాధించారు. 17 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేయాల్సి ఉన్నా పవన్ కోసం ఆయన గాజువాక సీటును త్యాగం చేసి పెందుర్తి నుండి పోటీ చేశారు. జనసేన పార్టీని గాజువాకలో బలోపేతం చేయడానికి వెంకట్రామయ్య ఎంతో కృషి చేశారు. 
 
నియోజకవర్గంలోని లక్ష మందికి సభ్యత్వాలు రావడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జనసేన పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం సైలెంట్ అయ్యారు. తాజాగా ఈయన వైసీపీలో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన పార్టీని ముఖ్య నేతలు వీడుతున్న విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే వీవీ లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, చింతల పార్ఠసారథి, మారంశెట్టి రాఘవయ్య, దేవిడ్ రాజు, తదితరులు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తాజాగా చింతలపూడి వెంకట రామయ్య మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో వైసీపీలో చేరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: