టీడీపీని మోయడం భారమేనా బాబూ ?

టిడిపి అధినేత చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బాబులో ఆందోళన తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా వైసిపి వలసలకు ప్రోత్సాహం ఇస్తుండటంతో, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి వైసీపీలో చేరుతున్నారు. పార్టీ మారే నాయకులను చంద్రబాబు ఎంతగా నచ్చచెప్పినా వారు మాత్రం పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. రానున్న కాలంలో టిడిపికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో నాయకులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. అందుకే అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు అంతగా ఆరాటపడుతున్నారు. 


ఇప్పటికే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన ప్రకాశం జిల్లా మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు వైసిపి లో చేరిపోయారు. అలాగే పులివెందుల టిడిపి నేత సతీష్ రెడ్డి కూడా టిడిపికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీలో చేరిపోయారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు ప్రజాబలం ఉన్న నాయకులు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వైసీపీ దూకుడు ఎక్కువగా ఉండడంతో  తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వైసిపికి అనుకూలంగా వెలువడితే టిడిపి నాయకులంతా వైసీపీలోకి క్యూ కడతారని, అదే జరిగితే ప్రస్తుతం టిడిపిలో ఉన్న ఎమ్మెల్యేల్లో మూడు  వంతుల మంది వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సంకేతాలు అందుతున్నాయి.


 దీంతో ఆయనలో ఎక్కడలేని ఆందోళన కనిపిస్తోంది. పార్టీ నాయకులు వలస వెళ్లకుండా చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారు ఎవరు మాట వినడం లేదట. 
టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు కూడా ఇప్పుడు వలసబాట పడుతూ పార్టీని వీడుతున్నారు. దీంతో లోకేష్, టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చేలా కనిపిస్తుండడంతో చంద్రబాబు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: