లోకల్ వార్ కు సై అంటున్న వారసులు !

NAGARJUNA NAKKA

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వారసులు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి తమ తండ్రులకు రాజకీయంగా సహాయం చేసిన వారు.. ఇప్పుడు లోకల్‌ వార్‌కు సై అంటున్నారు. స్థానిక సమరంలో తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధమైన ఆ వారసులు ఎవరు..? వారు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు..?

 

రాజకీయ వారసత్వాలకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. రాష్ట్ర రాజకీయాల్లో చిత్తూరు వారసులు.. చక్రమేలినవారు ఉన్నారు. దేశ స్థాయిలో గుర్తింపు పొందిన వారు కూడా ఉన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి, గల్లా అరుణ కుమారి, గల్లా జయదేవ్, మిధున్ రెడ్డి ఇలా వీరందరూ ఇదే కోవలోకి వస్తారు. వీరితో పాటు మరికొందరు రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు జిల్లా స్థానిక పోరులో తమ తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

 

భూమన కరుణాకర్‌ రెడ్డి తనయుడు అభినయ్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డి లోకల్‌ వార్‌కు సై అంటున్నారు. అభినయ్ రెడ్డి తిరుపతి కార్పోరేషన్ ఎన్నకల బరిలో దిగుతుండగా...మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి ఎంపీటీసీగా బరిలో దిగుతున్నారు. భూమన అభినయ్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి పని చేశారు. ఎన్నికల్లో విజయం తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా ఉన్నారు. నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం పర్యటిస్తూ పార్టీ నిర్వహాణలో కీలకపాత్ర పోషిస్తున్నారు అభినయ్‌. ఇప్పుడు తిరుపతి కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతను పూర్తిగా వేసుకుని పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. 

 

ఇక చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి సైతం గత ఎన్నికల నుండే తండ్రితో పాటు విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రగిరిలో యువతను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఎంపిటీసీ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు చెవిరెడ్డి మోహిత్‌. ఇలా వైసీపీ కీలకనేతల కుమారులు ఇద్దరు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో వారి అభిమానులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. 

 

ఈ ఇద్దరే కాకుండా మరికొందరు రాజకీయ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మంత్రి నారాయణ స్వామి సతీమణి పరంజ్యోతి  గంగాధర నెల్లూరులోని కార్వేటినగరం జెడ్పిటిసిగా బరిలో దిగుతున్నారు.ఇక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూమారుడు సుమన్ కూమార్ సైతం నారాయణవనం జెడ్పిటిసిగా రాజకీయాల్లో ఎంట్రి ఇవ్వడానికి రెడి అయ్యారు. ఇలా జిల్లాలో 25ఏళ్లకు  పైగా ప్రజా జీవనంలో కొనసాగిన నాయకులు.. వారసులను స్థానిక ఎన్నికల్లో దింపి తమ పట్టును నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: