జగన్ మరో సంచలన నిర్ణయం.... ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు...?
దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
కొన్ని విభాగాల్లోని ఉద్యోగులకు వారం రోజుల సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. రెండు బ్యాచులుగా విడిపోయి సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులలో ఒక్ బ్యాచ్ ఆఫీస్ లో ఒక వారం పని చేస్తే రెండో బ్యాచ్ ఇంటి నుండి పని చేయాలి. వారం తర్వాత రెండో బ్యాచ్ ఆఫీస్ నుండి పని చేస్తే మొదటి బ్యాచ్ ఇంటి నుంచి పని చేస్తుంది.
ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో పాటు సెక్షన్ ఆఫీసర్లు, నాన్ సెక్షన్ ఆఫీసర్లు రెండు బ్యాచులుగా విడిపోయి విధులు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ సెలవులు జిల్లా అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులకు కూడా వరిస్తాయని పేర్కొంది. గెజిటెడ్ అధికారులు మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ప్రధాని పిలుపు మేరకు ఏపీలో ఈరోజు ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు బంద్ కొనసాగుతోంది.
వైసీపీ ప్రభుత్వం ప్రజల సహకారంతో కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ప్రజారవాణావ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముందుగానే ప్రభుత్వం సూచించటంతో ప్రజలు నిత్యావసారాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం జగన్ నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు. కరోనా పేరుతో నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.