అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలే కాదు.. జైలుకు పంపుడే : మంత్రి కొడాలి నాని
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పడిగాడట ఒకడు.. ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. దాంతో నిత్యవసర వస్తువులకు రెక్కలొస్తున్నాయి. మొన్నటి వరకు కిలో పది రూపాయలకు అమ్మిన టమాట ఇప్పుుడు వంద అంటున్నారు. ఒకవేళ తీసుకోకుంటే మరో వ్యక్తి తీసుకుంటాడన్న భయం జనాలకు పట్టుకుంది.. ఈ భయాన్నే ఇప్పుడు వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు విరివిగా దొరికే ప్రతి వస్తువు లేదు అయిపోయాయి.. బ్లాక్ లో కొనాల్సి వస్తుంది... అందుకే అధిక రేట్లకు అమ్మాల్సి వస్తుందని బుకాయిస్తున్నారు.
మొత్తానికి ప్రజల్లో నెలకొన్న కరోనా భయం, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏర్పడుతోన్న అపోహలతో వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయంపై సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.. కొంత మంది ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలే కరోనా భయంతే దినసరి కూలీలు, ఇతర కార్మికులు పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటే.. అలాంటి వారిని ఇదే సమయంలో దోచుకుందాం అన్న రీతిలో వ్యాపారస్తులు ఉండటం శోచనీయం అన్నారు.
ఇలాంటి సమయంలోనే అందరం కలిసి కరోనాని నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. అధిక ధరలు అమ్ముతున్నా వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే జైలుకు పంపుతామని నాని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరించాలని ఇది వారికే కాకుండా దేశానికి కూడా మంచిదని చెప్పారు. సీఎం జగన్ చేసిన సూచనల మేరకు ఈ నెల 29వ తేదీన రేషన్ సరకులు అందజేస్తామని తెలిపారు. ఇక తెల్ల కార్డుదారులకు ఉచితంగా రేషన్ సరకులు, కిలో కందిపప్పు కూడా ఇస్తామన్నారు.