బ్రేకింగ్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా...!
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పడింది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా దెబ్బకు రాష్ట్రాలు లాక్ డౌన్ అవుతున్న నేపథ్యంలో ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఎన్నికలకు వాయిదా వేయాలని లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ స్థానాలలో ఇప్పటికే 37 స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో 18 స్థానాలకు మాత్రం ఎన్నికలు జరగాల్సి ఉంది.
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో 18 స్థానాలకు ఎన్నికల డేట్ ను ప్రకటిస్తామని సీఈసీ పేర్కొంది. ఏప్రిల్ 2, 9, 12 తేదీలలో 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుండి రాజ్యసభ స్థానాలకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరణ, పరిమల్ నత్వానీలను జగన్ ఖరారు చేశారు.
సీఎం కేసీఆర్ కే కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలను ఎంపిక చేశారు. రాజ్యసభకు తెలంగాణ నుండి వీరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గత కొంతకాలం నుండి కరోనా ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడవచ్చని ప్రచారం జరిగింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎన్నికల వాయిదా గురించి స్పష్టత వచ్చింది. దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాతే ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.