బ్రేకింగ్: కరోనాకు బ్రేక్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కరోనాకు బ్రేక్ వేసేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆళ్లనాని, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సచరిత, కన్నబాబు, బొత్స సత్యనారాయణలతో ఏర్పాటైన ఈ కమిటీ ప్రతిరోజూ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి కృషి చేయనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రివర్గం 2020 - 2021 బడ్జెట్ ఆర్డినెన్స్ ను ఆమోదించింది. మంత్రివర్గం ప్రధానంగా కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్ డౌన్ పరిస్థితుల గురించి చర్చించింది. ప్రభుత్వం వచ్చే మూడు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల నిమిత్తం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. గత రెండు రోజులుగా ఏపీ సరిహద్దుల దగ్గర తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు జరిగిన సమావేశంలో దీని గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో తొలి కాంటాక్ట్ కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం విశాఖకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బంధువుకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 384 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 55 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
ఈరోజు తిరుపతి స్విమ్స్ అస్పత్రిలో కరోనా కలకలం రేగింది. నిన్న హైదరాబాద్ లోని దోమలగూడకు చెందిన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. వీరు కొన్నిరోజుల క్రితం తిరుపతిలోని ఇద్దరు స్విమ్స్ ఆస్పత్రి వైద్యులను కలిసినట్లు తెలంగాణ ప్రభుత్వం విచారణలో తేలింది. విషయం తెలిసిన వెంటనే స్విమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ఇద్దరు వైద్యులను క్వారంటైన్ కు తరలించింది. వైద్యులు వీరి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నమూనాలకు సంబంధించిన రిపొర్టులు రానున్నాయి.