చంద్రబాబు ఎందుకిలా చేశాడు ? పార్టీలో పెద్ద ఎత్తున చర్చ ?

Vijaya
చంద్రబాబునాయుడు వరస చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. కొరోనా వైరస్ ప్రపంచ దేశాలను  ఎంత వణికిస్తోందో అందరూ చూస్తున్నదే. ఇందులో భాగంగానే మనదేశంలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ దెబ్బకు దేశం అన్నీ రంగాల్లోను కుప్పకూలిపోతోంది.  దేశ ఆర్ధిక మూలాలు కదిలిపోతున్నాయి. అందుకనే దాతలు ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. కొందరు ప్రధానమంత్రి సహాయనిధికి మరికొందరు ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలను అందిస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఏపి సహాయనిధికి రూ. 10 లక్షలు ప్రకటించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏపి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చాడే కానీ తెలంగాణాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. మరి ఏపితో పాటు తెలంగాణా కూడా చంద్రబాబు లెక్కల ప్రకారమే రెండు కళ్ళు కదా. మరి ఒక కన్నుకు మందేసి రెండో కన్నును ఎందుకు వదిలేసినట్లు ?

తాను కట్టుకున్న ప్యాలెస్ ఉండేది  హైదరాబాద్ లో. తన భార్య, కోడలుండేది కూడా భాగ్యనగరంలోనే. హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు ఉండేది కూడా హైదరాబాద్ లోనే. అయినా  తెలంగాణాకు మాత్రం విరాళం ఇవ్వలేదంటే ఏమిటర్ధం ? ఏమిటంటే పార్టీ పరంగా చంద్రబాబు తెలంగాణాను పూర్తిగా వదిలేశాడని.  మానసికంగా తెలంగాణాకు చంద్రబాబు, చినబాబు ఎప్పుడో దూరమైపోయారని  ప్రచారం పార్టీలోనే జరుగుతోంది. ఇపుడు విరాళం వ్యవహారం చూసిన తర్వాత ఆ విషయం నిజమే అని అందరూ అనుకుంటున్నారు.

తెలంగాణాలో పార్టీని వదిలేయక చంద్రబాబు చేయగలిగింది కూడా ఏమీ లేదనే చెప్పాలి. ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయాడు. తెలంగాణా రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడితే కేసియార్ దగ్గర తగులుకున్నట్లే. అందుకనే చేసేది లేక చంద్రబాబు తెలంగాణాకు దూరంగా ఉంటున్నాడు. కేసియార్ అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబుకు అడుగు పెట్టే అవకాశం ఉండదన్నది వాస్తవం. అందుకనే కొరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణాకు విరాళం కూడా ప్రకటించలేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: