ఏపీ ప్రజలకు శుభవార్త... లాక్ డౌన్ విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ రెండు వారాల క్రితం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగనుంది. ఏప్రిల్ 14 తర్వాత కేంద్రం లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తివేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో మాత్రం ప్రభుత్వం దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
గత వారం రోజుల నుంచి ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా నెల్లూరులో 43, గుంటూరులో 41 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టింది. 
 
రానున్న రోజుల్లో ప్రభుత్వం సుమారు 3 లక్షల ర్యాపిడ్ టెస్టులను నిర్వహించనుంది. ఏప్రిల్ 14 తర్వాత రాష్ట్రంలో హాట్ స్పాట్లుగా గుర్తించిన వాటిలో ఆంక్షలు కొనసాగుతాయని సమాచారం. రాష్ట్రంలో ఇప్పటివరకూ 314 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 280 మంది ఢిల్లీ మర్కజ్ ప్రార్థనకు హాజరైన వారు, వారి సన్నిహితులు కావడం గమనార్హం. దాదాపు 1000 మంది మర్కజ్ నుంచి రాష్ట్రానికి వచ్చారని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 
 
నిన్న రాష్ట్రంలో 11 కరోనా కేసులు నమోదు కాగా గుంటూరులో నిన్న ఒక్కరోజే 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం గమనార్హం. రానున్న రోజుల్లో కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 14 లోపు రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో కట్టడి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: