వేసవిలో వైరస్ ప్రభావం తగ్గుతుందా?

NAGARJUNA NAKKA

కరోనా కేసులు, మరణాల శాతం మాత్రం ఉష్ణ మండల ప్రాంత దేశాల్లో తక్కువగా ఉన్నాయి. అందులోనూ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశాల్లో కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉంది. రానున్నది వేసవి కావడంతో కరోనా ప్రభావం తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. వేసవిలో నిజంగానే వైరస్ ప్రభావం తగ్గుతుందా?

 

కరోనాపై విశ్వవ్యాప్తంగా నిపుణులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు, అధ్యయనాలు జరుపుతున్నారు. వీరిలో కొందరు కొత్త కరోనా వైరస్‌ వ్యాప్తికి, వాతావరణానికి సంబంధం ఉండొచ్చనే చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ కరోనా వ్యాప్తి తగ్గుతుందన్న ఆశలు చాలానే ఉన్నాయి. కొవిడ్ 19 పూర్తిగా కొత్త వైరస్‌. అందువల్ల వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రజలంతా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోక తప్పదని  హెచ్చరిస్తున్నారు.

 

భూమధ్య రేఖకు పైనా కిందా వ్యాపించి ఉన్న ప్రాంతమే ఉష్ణ మండలం. ఈ ప్రాంత దేశాల్లో దాదాపుగా ఆరోగ్య సంరక్షణ విధానాలు ఒక మాదిరిగానే ఉంటాయి. దీంతో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఈ దేశాల్లో పూర్తిస్థాయిల్లో జరగడం లేదని.. అందువల్ల బయటపడిన కేసుల కంటే వాస్తవంగా ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని చాలామంది నిపుణులు వ్యక్తం  చేస్తున్నారు.

 

భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్ద కలిసి 100కు పైగా ఉష్ణమండల దేశాలున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ కరోనా వ్యాప్తి ఇప్పటికీ 4 శాతం కంటే తక్కువే ఉంది. 2003లో విజృంభించిన 'సార్స్‌' వైరస్‌తో ప్రస్తుతం వణికిస్తున్న కొత్త కరోనా వైరస్‌కు కొన్ని పోలికలున్నాయి. దీంతో 'సార్స్‌' వ్యవహరించే తీరును పోలుస్తూ కరోనా కూడా వేడి వాతావరణంలో అంతగా వ్యాప్తి చెందదని కొందరు శాస్త్రవేత్తలు అంచనాకొస్తున్నారు.

 

కరోనా వైరస్‌ వ్యాప్తికి బయట ఉష్ణోగ్రతలకు సంబంధం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేమీ లేవు.  మనిషి శరీరం బయట  వైరస్‌ ఎంతకాలం బతుకుతుందన్న విషయంలో వాతావరణం కీలకపాత్రే పోషిస్తుందని స్పెయిన్‌కు చెందిన నేషనల్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ తెలిపింది. ఇది ఎంతకాలం బయట జీవించి ఉంటే వ్యాప్తి అంత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. మేరీలాండ్‌ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా 5-11 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వాతావరణం, తక్కువ తేమ ఉన్న నగరాల్లోనే ఉన్నట్లు తేలింది.

 

కరోనాకు కేంద్ర బిందువైన చైనాలో దాదాపు 100 నగరాలను పరిశీలిస్తే.. ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాప్తి మిగతా నగరాల కంటే తక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. చైనాలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఓ ఆసక్తికర అంశం బయటపడింది. కరోనాకు కేంద్ర బిందువైన వుహాన్‌లో దాదాపు 2,300 మంది చనిపోయారు. అప్పటికి ఆ నగరంలో ఉష్ణోగ్రత, గాలిలో తేమ తక్కువగా ఉంది. అయితే ఉష్ణోగ్రతలు, తేమ పెరిగిన తర్వాత మరణాలు బాగా తగ్గాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: