బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతి స్పెషల్ స్టోరీ...!
జ్యోతిబా పూలే అని పిలవబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే 1827 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అనంతరం పూల వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం వల్ల వారి ఇంటి పేరు పూలే గా మార్పు చెందింది. చిన్న వయస్సు నుంచే జ్యోతిరావు పూలేకు పుస్తక పఠనం అంటే ఆసక్తి ఎక్కువ. పూలే బాల్యంలోనే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించారు.
13 ఏళ్ల వయస్సులో జ్యోతిరావు పూలేకు 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. పూలే 1848 ఆగస్టు నెలలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడంతో బోధించటానికి ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పూలే అతని భార్య సావిత్రి పిల్లలకు పాఠాలు బోధించారు. పూలే ఆ కాలంలో వితంతు పునర్వివాహాల గురించి ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చారు.
పూలే కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. పూలే 1853 లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు.
1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారు. పూలే లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త జ్యోతిరావ్ పూలే. సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేసిన జ్యోతిరావ్ పూలే 1890 నవంబర్ 28వ తేదీన తుది శ్వాస విడిచారు.