లాక్ డౌన్ పై కేటీఆర్ ఏమన్నారో తెలుసా...?
తెలంగాణలో లాక్‌డౌన్ కొన్ని వారాలు పొడిగించాలని అభిప్రాయపడ్డారు ఐటీ మంత్రి కేటీఆర్. దీనిపై ప్రభుత్వం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్విట్టర్‌లో నెటిజన్లతో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌పై చర్చించారు. ప్రపంచమంతా అంగీకరిస్తే పదేళ్ల పాటు ఏడాదికోకసారి లాక్‌డౌన్ ఉండాలన్నారు కేటీఆర్. కరోనా ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాల కళ్లు తెరిపించిందని... భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి కచ్చితంగా అత్యధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని అపేందుకు లాక్ డౌన్ ను మరి కొంత కాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే ప్రభుత్వంలోని ఇతర భాగస్వాములతో కలిసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ద్వారా ప్రజల్లో స్వయం క్రమశిక్షణ ఏర్పడిందని దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. కొన్ని హాట్స్పాట్ లను గుర్తించామని, అలాంటి చోట్ల సామూహిక కరోనా టెస్టులను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందన్నారు కేటీఆర్.
విద్యార్థుల పరీక్షల గురించి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారని అయితే ప్రస్తుతం ఉన్నది సంక్షోభ సమయమన్నారు మంత్రి. ఇలాంటి సమయంలో కొంత ఓపిక పట్టాలని సూచించారు. పరీక్షల షెడ్యూల్ కి సంబంధించి ప్రభుత్వం సరైన సమయంలో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. ఒకవేళ ప్రపంచమంతా ఒప్పుకుంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పది రోజుల పాటు పరిమిత స్థాయిలో లాక్ డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని ఓ నెటిజన్ ప్రశ్నకు తన అభిప్రాయం చెప్పారు మంత్రి కేటీఆర్. మనసుకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని కొంతమందికి సమాధానమిచ్చారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ రాం గోపాల్ వర్మ అడిగిన ఓ ప్రశ్నకు సరదా కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. ఇళ్లలో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారని.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.. మెంటల్ హాస్పటళ్లలో చేరుతున్నారు.. ఫ్రస్ట్రేషన్‌లో కొందరు భర్తలు భార్యలను కొడుతున్నారు.. మీరు కూడా మమతా బెనర్జీలా పెద్ద మనసు చేసుకుని మాకు 'చీర్స్' చెప్పండి" అని ట్వీట్ చేశారు. దీనికి పశ్చిమ బెంగాల్‌లో మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వార్తను జత చేశారు. అయితే దీనికి మంత్రి కేటీఆర్ కూడా చమత్కారంగానే సమాధానమిచ్చారు. రాము గారు మీరు అడుగుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటున్నా.. అంటూ తనకేం అర్థం కానట్లు సరదా కామెంట్ చేశారు.
వైరస్ కట్టడి కోసం పని చేస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర రంగాలకు చెందిన ప్రతి ఒక్కరిపై ప్రజలకు ప్రత్యేకంగా గౌరవ భావం ఏర్పడడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు కేటీఆర్.