ఏపీ సర్కార్ పై కేంద్రం ఆగ్రహం... ఏం జరిగిందంటే...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ మంది పరీక్షలు నిర్వహిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఏపీకి చేరుకున్నాయి. 
 
ఆయితే తాజాగా సీఎం జగన్ కు కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జగన్ కు నిర్వహించిన పరీక్షలపై తాజాగా వివాదం తలెత్తింది. దేశంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఐ.సీ.ఎం.ఆర్ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారిని కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. 
 
కరోనా వైరస్ సోకినా కొన్ని రోజుల వరకు వైరస్ సంబంధిత లక్షణాలు కనిపించవు. ఆ సమయంలో పరీక్ష చేసినా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. నెగిటివ్ వచ్చిన వాళ్లు ఇష్టానుసారం తిరిగితే వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే మన దేశంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే నిబంధనను అనుసరించి ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు. 
 
ఎవరిలోనైనా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే మాత్రమే ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆయనకు పరీక్షలు నిర్వహించడంపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలు కనిపించిన వారం రోజుల తరువాత మాత్రమే ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని.... వైద్యుల పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  రాష్ట్రంలో ఈరోజు ఉదయం వరకు 603 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 42 మంది డిశ్చార్జ్ కాగా 15 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: