హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు... నగరానికి కేంద్ర బృందాలు...?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 984కు చేరింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతూ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో, సూర్యాపేట జిల్లాలో, జోగుళాంబ గద్వాల జిల్లాలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఈరోజు కోవిడ్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ వీకే పౌల్ మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల దేశంలో కరోనా విజృంభణ తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరిస్థితి సమీక్షించడానికి కేంద్ర బృందాలను పంపిస్తామని అన్నారు. లాక్ డౌన్ విధించినా దేశంలో కేసులు పెరుగుతున్నాయని కానీ లాక్ డౌన్ వల్ల డబులింగ్ రేట్ నెమ్మదిగా ఉందని అన్నారు. సరైన సమయంలో కేంద్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని కెప్పారు.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1684 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23,077కు చేరుకుంది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 718కు చేరింది. ఇప్పటివరకు 4,078 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కేంద్రం తాజాగా నాలుగు ఇంటర్ మినిస్టిరియల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేసింది. ఈ బృందాలు నాలుగు నగరాల్లో పర్యటించనున్నాయి.
ఈ బృందాలు ఆ నగరాలలో కరోనా కేసులు పెరగడానికి గల కారణాలు, నిత్యావసర వస్తువుల సరఫరా, లాక్ డౌన్ అమలవుతున్న తీరు , పునరావాస కేంద్రాల్లో వైద్య నిపుణుల పరిస్థితి, వైద్య నిపుణుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలను పరిశీలించనుంది. మరోవైపు తెలంగాణలో గత మూడు రోజుల నుంచి కరోనా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్లే కరోనా అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు.