‘మహా’రాష్ట్ర కేరాఫ్ 30 శాతం
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి అదుపు తప్పుతోంది. అక్కడ రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో మహారాష్ట్ర రాష్ట్రంలో 394 కరోనా కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 6817 కేసులు నమోదయ్యాయి. 301 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.
దేశంలో నమోదైన కేసుల్లో 30 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో అధిక శాతం కేసులు ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో మంత్రికి సైతం కరోనా సోకిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రికి కరోనా సోకడంతో అధికారులు 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా వైరస్ వల్ల రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో మరెక్కడా లేని సౌకర్యాలు ముంబై రాష్ట్రంలో ఉన్నాయి. కానీ కరోనాను ఎదుర్కోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. రెండు కోట్ల జనాభా ఉన్న ముంబైలో జనసాంద్రత చాలా ఎక్కువ. ధారావి, గోవండీ, వొర్లికొలివాడ వంటి మురికివాడల్లో దాదాపు 40 శాతం జనం నివశిస్తున్నారు.
ఈ మురికివాడల్లోనే వైరస్ విజృంభిస్తూ ఉండటంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావటానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకురావటానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు దేశంలో కరోనా భాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు వరకు 24942 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 5210 మంది మృతి చెందగా 779 మంది డిశ్చార్జ్ అయ్యారు.