లాక్ డౌన్ ఎఫెక్ట్ తో మూగబోయిన నాదస్వరం..!
లాక్డౌన్ వేళ నాదస్వర బృందాలకు పని లేకుండా పోయింది. పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఎక్కువగా ఉండే ఈ సీజన్లోనే లాక్డౌన్ వచ్చిపడింది. హైదరాబాద్లో పని చేసే నాదస్వరం బృందాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. నగరానికి వచ్చిన వారికి ప్రస్తుతం పస్తులుండే పరిస్థితులు దాపురించాయి. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం నాదస్వరం మూగబోయింది.
లాక్డౌన్ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. సోషల్ డిస్టెన్స్ పేరిట శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. ఫలితంగా వీటి మీదే ఆధారపడి జీవించే వారి బతుకులు దుర్బరంగా తయారయ్యాయి. సాధారణంగా పెళ్లిళ్లు...పేరంటాలు...చిన్నాచితక శుభకార్యాలు మార్చి నెలాఖరు నుంచి మే వరకు చేయటానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. లాక్డౌన్తో పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఫంక్షన్ హాళ్లు మూతపడ్డాయి. చిన్నా...చితకా కార్యాక్రమాలన్నింటిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిషేధం ప్రకటించింది. ఇలాంటి తరుణంలో వీటిపైనే ఆధాపడిన నాదస్వరం బృందాలకు పని లేకుండాపోయింది. పొట్టకూటి కోసం వచ్చిన వారికి ఇప్పుడు పూట గడవటమే కష్టంగా మారింది. శుభ కార్యాలు లేకపోవటంతో నాదస్వరం మూగబోయింది.
నాదస్వరంను జీవనోపాధిగా ఎంచుకున్న వాళ్లకు ఇప్పుడు ఆ వృత్తే కడుపు నింపడం లేదు. మంచి రోజులు ఉండటం... ముందే ఆర్డర్లు రావటంతో పొరుగు రాష్ట్రంలో నుంచి కూడా బృందాలను హైదరాబాద్కు రప్పించాయి ఇక్కడి టీమ్లు. హైదరాబాద్కు వచ్చిన నాదస్వరం బృందాలకు ప్రస్తుతం ఎలాంటి పని దొరకటం లేదు. సొంతూరును విడిచి వచ్చిన వారు లాక్డౌన్లో చిక్కుకుపోయారు. ఇంటికి వెళ్లటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నాదస్వర బృందాలు ఇక్కడ పస్తులు ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. తీసుకొచ్చిన యజమాని డబ్బులు ఇవ్వకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజానికి...మార్చి నెల నుంచే మంచి రోజులు. లాక్డౌన్ మూలంగా వచ్చే రెండు నెలల పాటు కూడా ఎక్కువగా శుభ కార్యాలు జరిగేలా లేవు. ఫలితంగా దిక్కుతోచని పరిస్ధితుల్లో చిక్కుకుపోయారు నాదస్వర బృందం సభ్యులు.