టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానం.... ఉక్కు సంకల్పంతో పార్టీని విజయతీరాలకు చేర్చిన కేసీఆర్...!

Reddy P Rajasekhar

చాలా మంది చరిత్ర నుంచి ఎన్నో విషయాలను తెలుసుకుని ప్రభావితమవుతారు. కొందరు మాత్రం కొత్త చరిత్రను లిఖిస్తారు. అలాంటి వారిలో సీఎం కేసీఆర్ ఒకరు. ప్రస్తుతం జనం గుండెల్లో కొలువైన వెలుగు దీపం కేసీఆర్. స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణను సాధించారు. 
 
కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ శవయాత్రో.. తెలంగాణ జైత్ర యాత్రో అని కేసీఆర్ కేయూ గడ్డ మీద ఆరోజు చేసిన ప్రకటన చారిత్రాత్మకం . రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో మరో రెండు శతాబ్దాల భవితకు భరోసాలా కనిపిస్తోంది. కేసీఆర్ ఉక్కుసంకల్పం, వ్యూహాల ముందు విధి సైతం తలవంచి తెలంగాణ ఆవిర్భవించింది. 
 
చినుకుగా మొదలైన తెలంగాణ ఉద్యమం తక్కువ కాలంలోనే తుఫాన్ లా మారి రాష్ట్ర రాజకీయాలనే మార్చేసిందంటే దానికి కారణం కేసీఆర్. టీఆర్‌ఎస్‌ పార్టీని సీఎం కేసీఆర్ ను వేరువేరుగా చూడలేం. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదల వల్ల తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందగా రాష్ట్రపతి మార్చి 21న బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్‌లో 2014 జూన్‌ 2 ‘అపాయింటెడ్‌ డే’ గా పేర్కొన్నారు. 
 
లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరగనున్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జెండా ఎగురవేయనున్నారు. పార్టీ 20వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సామాజిక దూరం పాటిస్తూ వారం రోజుల పాటు రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు, వలస కార్మికులకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: