దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్... కానీ...?
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కానీ అదే స్థాయిలో కరోనా నుంచి బాధితులు కోలుకుంటున్నట్టు తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. 78 శాతం కరోనా మరణాల్లో ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పారు.
కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. లాక్ డౌన్ ఆంక్షల సమయంలో వలస కూలీలకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. కూలీలకు, పేదలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని పేర్కొన్నారు. లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని తెలిపారు. గడచిన 24 గంటల్లో 1718 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
దేశంలో ఇప్పటివరకు 8324 మంది కరోనా నుంచి కోలుకున్నారని అన్నారు. 14 రోజుల క్రితం రికవరీ రేటు 13.06 శాతంగా ఉండేదని ప్రస్తుతం ఆ రేటు 25.19 శాతంగా నమోదైందని తెలిపారు. భారత్ లో కరోనా మరణాల రేటు 3.2 శాతంగా ఉందని తెలిపారు. దేశంలో కరోనా కేసుల రెట్టింపు కాలం 11 రోజులకు పెరిగిందని తెలిపారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సాలిల శ్రీవాస్తవ హైదరాబాద్ లో టెస్టింగ్ కిట్లు, పీపీఈలు, ఇతర సామాగ్రి ఉన్నట్టు గుర్తించిందని చెప్పారు.
కరోనా కట్టడి కోసం కేంద్రంతో కలిసి నడవాలని రాష్ట్రాలను కోరుతున్నామని తెలిపారు. కరోనా ప్రభావం లేని ప్రాంతాలలో ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడంపై అవగాహన పెరిగిందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ఈరోజు 71 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1403కు చేరింది.