ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు !

NAGARJUNA NAKKA

లాక్ డౌన్ ఎత్తివేసేందుకు భారత్.. తెలివైన వ్యూహాలు రచించాలన్నారు ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడినందువల్ల.. భారత్‌లో వెంటనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. సంక్షోభ సమయంలో అధికార వికేంద్రీకరణ చాలా ముఖ్యమన్నారు రాజన్. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో ఇంటరాక్షన్‌లో రాజన్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు.

 

40 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్.. దేశ ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రధానంగా లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. వివిధ రంగాల ప్రముఖులతో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్‌ ద్వారా ఇంటరాక్షన్ అవుతున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో ..రాహుల్ సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. కరోనా వైరస్ తీవ్రత, లాక్ డౌన్ ప్రభావం, ఎత్తివేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగ భద్రత, వ్యవసాయ రంగం, వలసకార్మికుల సమస్యలు, ఇతరత్రా అంశాలపై రాజన్‌ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు రాహుల్.

 

లాక్‌డౌన్ నిరంతరం కొనసాగించలేమ‌నీ.. దీన్ని ఎత్తివేసేందుకు భారత్ తెలివైన వ్యూహాలు రచించాలని రఘురాం రాజన్ సూచించారు.కరోనా కల్లోలం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపైనే ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. పొడిగించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడినందున... భారత్‌లో వెంటనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు రాజన్.  

 

లాక్‌డౌన్ సందర్భంగా పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతమేర నిధులు ఇవ్వాల్సి ఉంటుందంటూ రాహుల్ అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.....దీని కోసం భారత్ రూ.65 వేల కోట్లు కేటాయించాలన్నారు.. ప్రస్తుతం దేశ జీడీపీ 200 లక్షల కోట్లు ఉందని, ఈ లెక్కతో పోల్చితే 65వేల కోట్లు ఖర్చు చేయడం పెద్ద భారం కాకపోవచ్చని తెలిపారు. ప్రస్తుతం  అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామనీ.. వ్యాపారాలు, కార్యాలయాలు ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ప్రభుత్వం ప్రణాళికలు రచించాలన్నారు రాజన్.  ప్రజా రవాణా సహా అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం తప్పనిసరి అన్న విషయం గుర్తించాలన్నారు.  ఈ సంక్షోభ సమయంలో అధికార వికేంద్రీకరణ చాలా ముఖ్యమని కూడా రాజన్ సూచించారు.

 

లాక్‌డౌన్‌ వలసకూలీలు, వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు రఘురాం రాజన్‌. ఇప్పటికే దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా, మూడు నాలుగు నెలల పాటు దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. వారిసంరక్షణపై ప్రభుత్వాలుదృష్టి కేంద్రీకరించాలన్నారు రాజన్.

 

కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు రఘురామ్ రాజన్‌. ఐతే అమెరికాలో లాగా ర్యాండమ్ టెస్టులు చేయలేమన్నారు. ఐతే హాట్‌ స్పాట్ ఏరియాల్లో కనీసం వెయ్యి షాంపుల్స్ సేకరించి పరీక్షలు చేయాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: