80 కుటుంబాలు కుల బహిష్కరణ.. అసలు ఏం జరిగిందంటే..!
దేశమంతటిని కరోనా భయం వెంటాడుతుంటే నిజామాబాద్ జిల్లాలో మాత్రం కులాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కులాంతర వివాహం కారణంగా 80 కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయి. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగం గ్రామంలో 80 కుటుంబాలను కుల బహిష్కరణ చేయటం వివాదాస్పదంగా మారింది. రెడ్డికా సామాజిక వర్గం తాము కుల బహిష్కరణకు గురయ్యామని మెండోరా తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
రెడ్డికా కులస్థుడైన ఓ అబ్బాయి...మున్నూరు కాపు అమ్మాయిని ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మేజర్లే కావటంతో ఎవరూ వారి పెళ్లిని అడ్డుకోలేకపోయారు. మున్నూరు కాపు సామాజికవర్గం తమను కుల బహిష్కరణ చేసిందని రెడ్డికా సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు చెబుతున్నారు. రెడ్డికా కులస్థులతో, మున్నూరు కాపువారు మాట్లాడితే లక్ష రూపాయల జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
ఇది చాలదన్నట్లుగా వ్యవసాయ పనులకు ఎవరినీ పంపించకూడదని గ్రామంలో ఏకంగా తీర్మానమే చేశారు. తమ ఇళ్లల్లో అద్దెకు ఉన్న రెడ్డికా కులస్థులను వెంటనే ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. అప్పులు తీసుకున్నవారు తక్షణమే చెల్లించాలని వేధిస్తున్నారు. వ్యవసాయ సొసైటీలో పని చేసే రెడ్డికా కులస్థులను పని మాన్పించారు. ఫలితంగా వారికి ఉపాధి లేకుండా పోయింది. పశువులను సైతం మంద నుంచి వేరు చేయాలని ఆంక్షలు పెట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని అధికారులను రెడ్డికా కులస్థులు కోరుతున్నారు.
టెక్నాలజీ రంగంలో దేశం దూసుకెళ్తున్నా.. కొందరిలో ఇంకా కులగజ్జి పోవడం లేదు. మనుషులంతా ఒక్కటే.. మానవత్వమే నిజమైన కులం, మతం అని పలు సంస్థలు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పురావడం లేదు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు.. తాము అనుకుందే కరెక్ట్ అని అనుకుంటున్నారు. తమ పిల్లలపై కులాన్ని బలంగా రుద్దుతున్నారు.