రైతు భరోసా.. రైతన్నకు జగన్ సర్కారు ఇచ్చే అండ ఇది. రైతులకు పెట్టుబడి సాయం కోసం.. సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయం ఇది. ఏటా రైతు భరోసా కింత రూ. 13,500 ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. నేడు, రేపు మాత్రమే చివరి అవకాశం.
అర్హులైన వారు ఈ నెల 10వ తేదీ లోగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. అర్హులైన రైతుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని జగన్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా జగన్ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.
అంతే కాదు.. ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 10 వేల టన్నుల బత్తాయి కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు. రిటైల్ అమ్మకాల్లో కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనను సీఎం అంగీకరించారు.
ఇదే సమయంలో కరోనా కారణంగా.. రైతులు మండల కేంద్రాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్న విషయం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లను అనుమతించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని జగన్ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: