పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.... పరీక్షలు లేకుండానే పై తరగతులకు..?
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 56,516 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 1895 మంది మృతి చెందగా 16,867 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల దేశంలో పలు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల చివరి వారం పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం ఖచ్చితంగా నిర్వహిస్తామని చెబుతున్నాయి. అయితే తాజాగా పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పదో తరగతి విద్యార్థులు డైరెక్ట్ గా ఇంటర్ కు ప్రమోట్ కానున్నారు. ప్రీ బోర్డు పరీక్ష ఫలితాల ఆధారంగా ప్రభుత్వం వారిని ప్రమోట్ చేయనుంది. పంజాబ్ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని సమాచారం.
ఈ నెలలో పరీక్షలు నిర్వహించి జూన్ నెలలో ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో లాక్ డౌన్ ఎత్తివేసిన రెండు నెలల తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిక ముందే ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజుల్లో మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ నెలాఖరుకు ఇరు రాష్ట్రాల్లో పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.