ఒకే రోజు 21మందికి క‌రోనా.. శ్రీ‌కాకుళం జిల్లాలో క‌ల‌క‌లం..

Kaumudhi

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో క‌రోనా వైరస్ మ‌ళ్లీ కలకలం రేపుతోంది. సుమారు 46 రోజులుగా ఈ జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. అయితే నిన్న ఒక్కరోజే ఏకంగా 21 పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనతో అధికారులు వెంటనే అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి ఈ 21 కేసులు జిల్లాకు సంబంధం లేనివే. ఈనెల 12వ తేదీన చెన్నై నుంచి వచ్చిన శ్రామిక్‌ రైలులో వీళ్లంతా శ్రీకాకుళం చేరుకున్నారు. ఉద్దానం చుట్టుప‌క్క‌ల‌ ప్రాంతాల‌కు చెందిన వీళ్లందరినీ సరుబుజ్జిలి మండలం శాస్త్రుల పేట క్వారంటైన్‌ సెంటర్లో అధికారులు ఉంచారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వీళ్ళందరూ చెన్నైలో వలస కూలీలుగా పని చేస్తున్నారు. క‌రోనా వైర‌స్‌ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో వీళ్ళందరూ అక్కడ చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ కార‌ణంగా స్వ‌స్థ‌లాల‌కు రాలేక‌పోయారు. అయితే వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్ల‌ను నడుపుతున్న విషయం తెలిసిందే.

 

ఇందులో భాగంగానే చెన్నై నగరం నుంచి ఉద్దానం ప్రాంతానికి చెందిన వలస కార్మికులందరూ ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. క్వారంటైన్ సెంటర్ కు తరలించిన తర్వాత అధికారులు వెంటనే పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చింది. మళ్లీ నిన్న జరిగిన పరీక్షల్లో ఏకంగా 21 మందికి కొవిడ్‌-19 పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు మళ్లీ  నిర్ధారించుకునేందుకు నమూనాలను కాకినాడ వైరాలజీ సెంటర్ కూడా పంపారు. అక్కడ కూడా ఇదే ఫలితం రావడంతో అధికారులు షాక్‌కు గుర‌య్యారు. వెంట‌నే అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు. సెంటర్లో సుమారు 200 మందికి పైగా ఉన్నారు. దీంతో మరి కొందరు కూడా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై ఉన్న‌తాధికారులు ప్ర‌త్యేక దృష్టిసారించి వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: