క‌రోనా వ్యాక్సిన్ అందించే మొద‌టి దేశం చైనాయే..?

Kaumudhi

క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లు అయిన చైనా.. దానికి విరుగుడు క‌నిపెట్టే ప‌నిలోనూ ముందంజ‌లోనే ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను త‌యారు చేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే సుమారు 100 వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. తాజాగా.. బీజింగ్ విశ్వవిద్యాలయంలోని ఒక పరిశోధనా బృందం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జంతువులపై ప్రయోగాత్మకంగా ఉప‌యోగించిన ఔష‌ధం మంచి ఫ‌లితాల‌ను ఇచ్చిన‌ట్లు పేర్కొంది, ఇది కొవిడ్ -19 రోగులను తొంద‌ర‌గా కోలుకునేలా చేస్తుంద‌ని, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని అందిస్తుంద‌ని చెప్పింది. అలాగే.. బీజింగ్ అడ్వాన్స్‌డ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జెనోమిక్స్ డైరెక్టర్ సన్నీ క్సీ నేతృత్వంలోని బృందం క‌రోనా వైర‌స్‌కు వ్య‌తిరేకంగా న్యూట్ర‌లైజింగ్ యాంటీబాడీస్‌ని విజయవంతంగా గుర్తించిందని పీకింగ్ విశ్వవిద్యాలయం తెలిపింది. కొవిడ్‌-19కు వ్య‌తిరేకంగా ఔష‌ధాల‌ను అభివృద్ధి చేయడానికి శక్తివంతమైన న్యూట్రలైజింగ్ యాంటీబాడీని ఉపయోగించవచ్చున‌ని తెలిపింది.

 

వ‌చ్చే శీతాకాలంలో కొవిడ్ -19 మహమ్మారి మళ్లీ విజృంభిస్తే.. ఆ సమయానికి త‌మ న్యూట్ర‌లైజింగ్‌ యాంటీబాడీ అందుబాటులో ఉండవచ్చున‌ని అంటున్నారు. క‌రోనా వైర‌స్ సోకిన ఎలుక‌ల‌పై యాంటీబాడీస్‌ను ప్ర‌యోగించ‌గా.. సుమారు ఐదురోజుల త‌ర్వాత వైర‌స్ ప్ర‌భావం త‌గ్గింద‌ని, అంటే ఈ మందు ప‌నిచేస్తుంద‌న్న‌ట్లు అర్థ‌మైంద‌ని చెబుతున్నారు. హెచ్‌ఐవీ, ఎబోలా త‌దిత‌ర వైర‌స్‌ చికిత్సలో యాంటీబాడీస్‌ విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. అయితే.. ప్ర‌స్తుతం ఎన్ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా.. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో రావ‌డానికి ఏకంగా 18 నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చున‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మూడు కొవిడ్ -19 వ్యాక్సిన్లు బీజింగ్‌లో రెండో ద‌శ‌ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న‌ట్లు మునిసిపల్ ఆరోగ్య అధికారి తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ రెండవ దశ జూలై నుంచి క్ర‌మంగా పూర్తి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే.. మిగ‌తా దేశాల‌క‌న్నా.. ఈ ప్ర‌పంచానికి చైనానే ముందుగా వ్యాక్సిన్‌ను అందించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముందుగా చైనాలోనే వైర‌స్ పుట్ట‌డం వ‌ల్లే.. ఆదేశం ప‌రిశోధ‌న‌లు కూడా అన్నిదేశాల‌క‌న్నా ముందుగానే మొద‌లు పెట్టింద‌ని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: