ఏమైంది నాగబాబు ? ఎందుకు ఈ కాంట్రవర్సీ ?

జనసేన నాయకుడు నాగబాబు వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఉన్నట్టుండి వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తూ ట్విట్టర్ ద్వారా రకరకాల అంశాలపై స్పందిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. జనసేన పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గతేడాది పోటీ చేసిన నాగబాబు అక్కడ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడప్పుడు జనసేన సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ లో కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఒక దశలో ఆయన రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదు గాని, అకస్మాత్తుగా ట్విట్టర్ ద్వారా వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ నాగబాబు పోస్ట్ లు పెడుతున్న తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. తాను విమర్శలపాలు అవుతానని తెలిసినా స్పందిస్తున్నాను అంటూ చెబుతూనే నాగబాబు ట్విట్స్ పెడుతున్నారు. 

 

మహాత్మా గాంధీ ని కాల్చి చంపిన నాథురాం గాడ్సే గురించి నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన నిజమైన దేశభక్తుడని, అప్పట్లో ఆయన కోణాన్ని ఏ మీడియా చూపించలేకపోయింది అంటూ నాగబాబు ట్విట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తెలంగాణలో నాగబాబుపై పోలీసు కేసు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరలా ఇప్పుడు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను ఎద్దేవా చేసే విధంగా నాగబాబు ట్వీట్ చేశారు. విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్నఎల్జీ పాలిమార్స్ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడిన అనంతరం అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ రంగంలోకి దిగారు.


 గ్యాస్ ప్రభావానికి గురైన గ్రామంలో ఆయన నిద్రించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధైర్యం చెబుతూ గ్రామంలోనే కలియ తిరుగుతూ అక్కడ పశువులకు గడ్డి వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ ఆవుకి గడ్డి వేస్తున్న ఫోటో ను నాగబాబు ట్విట్ చేశారు. ఆ ఫోటోకు అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను అంటూ నాగబాబు క్యాప్షన్ పెట్టారు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి అవంతి శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 నుంచి పోటీ చేసి గెలిచారు. 

 

ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు అవంతి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ కు పవన్ తో గానీ, నాగబాబుతో కానీ, వ్యక్తిగత రాజకీయ వివాదాలు ఏమున్నాయో తెలియదు కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనను టార్గెట్ చేసుకుంటూ నాగబాబు స్పందించడం పై రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. నాగబాబు పొలిటికల్ గా ఉనికిని చాటుకునేందుకు ఇలా వివాదాస్పద అంశాల జోలికి వెళ్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: