కొన్ని రాష్ట్రాల్లో సడలింపులు ఎలా ఉన్నాయంటే.. !
దేశవ్యాప్తంగా లాక్డౌన్-5 అమలులోకి వచ్చింది. కంటెయిన్మెంట్ జోన్లకు మాత్రమే ఆంక్షలు వర్తించనున్నాయి. మిగతా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలకు కూడా నేటి నుంచే అనుమతి ఇచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా కేంద్రం సడలింపులు ఇచ్చినా.. వివిధ రాష్ట్రాల్లో ఆ నిబంధనలు రకరకాలుగా అమలవుతున్నాయి. కొన్నిచోట్ల వైరస్ తీవ్రత దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తుంటే.. మరికొన్ని చోట్ల కేంద్రం ఇచ్చిన సడలింపులన్నింటికీ ఓకే చెప్పారు. ఢిల్లీలో తెల్లవారుజామునే కూరగాయలు, పండ్ల మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు జనం భారీగా వచ్చారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో వైరస్ ఎక్కువగా ఉంది కాబట్టి.. అక్కడి నుంచి యూపీలోకి ప్రజల్ని అనుమతించడం లేదు. ఈపాస్ లు, అత్యవసర సేవలకు సంబంధించిన వారికి మాత్రమే అనుమతి ఉంది. అయితే ఢిల్లీ నుంచి హరియాణాలోకి మాత్రం వాహనాల రాకపోకల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఢిల్లీ - గురుగ్రామ్ రహదారి రద్దీగా మారింది.
ఆంక్షల సడలింపుతో ముంబయిలోని పలు మార్కెట్లకు జనం నేడు భారీగా తరలివచ్చారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు ఈ నెల 8 నుంచి అనుమతిస్తామని కేంద్ర స్పష్టం చేసినప్పటికీ.. గంగా దసరా కావడంతో.. పుణ్యస్నానమాచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చారు.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నతరుణంలో.. కొన్ని ప్రాంతాల్లో కిరాణా, కూరగాయల దుకాణాల తెరుచుకోవడానికి అనుమతించినప్పటికీ.. వస్తువుల్ని ఇంటికే సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలు, పుణ్యక్షేత్రాలను తెరిచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతివ్వడంతో.. ప్రార్థనలు జరిగాయి.
రాజస్థాన్ లో మాత్రం ప్రార్థనామందిరాలు, మాల్స్ కు అనుమతి లేదు. అయితే మ్యూజియంలు, చారిత్రక కట్టడాల సందర్శనకు అనుమతించారు. హోటళ్లలో కూడా టేక్ అవేకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్ లో ప్రార్థనా మందిరాలు కేంద్రం సూచించినట్టుగా ఈ నెల 8న తెరుచుకుంటాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో పనిచేయొచ్చని రాజస్థాన్ సర్కారు సూచించింది. ప్రైవేట్ ఆఫీసులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సలహా ఇచ్చింది.
తమిళనాడులో నాన్ ఏసీ రెస్టారెంట్లలో డైన్ ఇన్ కు అనుమతిచ్చారు. అయితే సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మాత్రమే ఉండాలి. కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్ లో జూన్ 8 నుంచి మాల్స్ తెరుచుకుంటాయి. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో జూన్ 7 వరకు షాపింగ్ మాల్స్ మూసే ఉంటాయి. బెంగాల్లో టీతోటలు, జూట్ మిల్లులు, మైనింగ్, నిర్మాణ రంగ కార్యకలాపాలకు వంద శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతిచ్చారు.
కరోనాతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించినా.. నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 3 నుంచి సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్ కు అనుమతిస్తారు. ప్రైవేట్ ఆఫీసులకు 15 శాతం సిబ్బందితో పనిచేసే వెసులుబాటు ఇస్తారు. స్వయం ఉపాధి పొందే వాళ్లకు కూడా పర్మిషన్ ఇస్తారు. జూన్ 5 నుంచి మార్కెట్లు, క్యాబ్ సర్వీసులకు అనుమతి ఇస్తారు.
ఢిల్లీలో మూడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారం రోజుల పాటు సరిహద్దులు మూసేస్తామని ప్రకటించింది. అన్ని రకాల మార్కెట్లు, సెలూన్లు, షాపులకు అనుమతిస్తూనే.. స్పాలు మాత్రం మూసేసింది. ఈ రిక్షాలు, ఆటోల్లో పరిమిత సంఖ్యలో ప్రయాణికులు ఉండాలన్న నిబంధన కూడా ఎత్తేసింది. అంతర్రాష్ట్ర రాకపోకల విషయంలో కూడా రాష్ట్రాలు తలో రకంగా నిర్ణయాలు తీసుకున్నాయి. కర్ణాటకలో కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలున్నాయి. ఛత్తీస్ గఢ్ అయితే పాసులున్నవారినే అనుమతిస్తోంది.