ఏపీ కరోనా పరీక్షల్లో ఫస్ట్... రికవరీల్లో బెస్ట్.... కానీ....?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ వైరస్ భారీన పడుతున్న బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలతో పాటు అధికారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,000 దాటగా ఆంధ్రప్రదేశ్ లో 3377 కేసులు నమోదయ్యాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి చాలా మందే వచ్చినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. భారీగా లాక్ డౌన్ సడలింపులు అమలవుతున్నా రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పల్లెలకు కూడా వైరస్ వ్యాపించడం ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.
అయితే టెస్టుల విషయంలో మాత్రం దేశంలో మరే రాష్ట్రం చేయని స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ రాష్ట్రంలో 10,000 కరోనా పరీక్షలు జరుగుతుండగా 200 లోపు కేసులు నమోదవుతున్నాయి. కరోనా పరీక్షలతో పాటు రికవరీ రేటులో కూడా ఏపీ బెస్ట్ గా నిలుస్తోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 48 శాతంగా ఉంటే ఏపీలో ఈ రేటు 69 శాతంగా ఉంది. ఇప్పటివరకు 71 మంది మృతి చెందగా రాష్ట్రంలో మరణాల రేటు కూడా తక్కువగానే ఉండటం గమనార్హం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణలో పాజిటివ్ ఫలితాలనే అందుకుంటోంది. కానీ తూర్పు గోదావరి జిల్లాలోని మామిడాడలో ఒక వ్యక్తి నుంచి 117 మందికి... చుట్టుపక్కల ఐదు మండలాల్లోని మరో 40 మందికి కరోనా సోకింది. ఒకరి నుంచి 157 మందికి కరోనా సోకడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని ఉందని ప్రచారం జరుగుతోంది. అనధికారికంగా ఒక హోటల్ కు అనుమతులు ఇవ్వడం వల్లే భారీగా కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.