గ్యాస్ లీకేజీ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ !

NAGARJUNA NAKKA

ఎల్జీపాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై హైపవర్ కమిటీ రెండోరోజు విచారణ జరిపింది. జీవీఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలు, నేతలతో కమిటీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రమాద కారణాలు, ప్రజలు నివసించేందుకు నివాసయోగ్యమా కాదా.. ఒకవేళ ప్రజలు అక్కడే నివసిస్తే  ఎలాంటి భరోసా కల్పించాలి అనే  అంశాలపై.. వారి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. సమావేశం సందర్భంగా.. జీవీఎంసీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

విశాఖలో ఎల్జీపాలిమర్స్ గ్యాస్ లీక్ కారణాలు, పర్యావరణంపై ప్రభావం తదితర అంశాలపై .. హైపవర్ కమిటీ విచారణ కొనసాగుతోంది. రెండోరోజూ జీవీఎంసీ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలతో కమిటీ ప్రతినిధులు భేటీ ఆయ్యారు. కమిటీ సభ్యులతో సమావేశంలో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో గ్రామస్తులకు  అనుమతి ఇవ్వడం జరిగింది. ఒక్కోగ్రామం నుంచి ఏడు నుంచి పదిమందికి మాత్రమే లోపలికి అనుమతించారు.. మొదట బాధిత ప్రజల నుండి అభిప్రాయాలు హై పవర్ కమిటీ సేకరించింది. గ్రామస్తులు తమ సమస్యలు, డిమాండ్ల గురించి ఏకరువు పెట్టారు. కంపెనీని అక్కడి నుంచి తరలించాలని కొందరు డిమాండ్ చేస్తే... మరికొందరు తాము నివసించడానికి భరోసా కల్పించి,  హెల్త్ కార్డులు, గ్రామాల్లో హాస్పిటల్స్ కట్టించాలని కోరారు.

 

నిత్యవసరాలు, వైద్యసేవలు అందించడంతో పాటు ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలని వెంకటాపురం గ్రామస్తులు కోరారు. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారికి ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేస్తామని హైపవర్ కమిటీ సభ్యులు హామీ ఇచ్చారని వెంకటాపురం గ్రామస్తులు తెలిపారు.

 

గ్రామస్తులతో భేటీ అనంతరం హైపవర్ కమిటీ సభ్యులు.. అఖిలపక్ష ప్రతినిధులు, నేతలతో సమావేశమయ్యారు. అయితే పరిమిత సంఖ్యలోనే లోపలికి పంపించడంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఎదురుగా ధర్నాకు దిగారు.  ప్రభుత్వం నామమాత్రపు హై పవర్ కమిటీని వేసి.. ఈ ఘటనను నీరు గార్చేంచేందుకు ప్రయత్నిస్తోందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. 

 

మధ్యాహ్నం సెషన్ లో భాగంగా హైపవర్ కమిటీ ముందు .. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాద కారణాలను కమిటీకి వివరించారు.కంపెనీ భద్రతా, రక్షణ ప్రమాణాలను హైపవర్ కమిటీకి వివరించారు. రేపు జీవీఎంసీ, విఎంఆర్డీఏ ప్రతినిధులతో హైపవర్ కమిటీ సభ్యులు సమావేశమై.. కంపెనీ పర్మిషన్లు,ఇతర అంశాలపై వివరాలు సేకరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: