కరోనా ప్రభావం మీడియా రంగంపై చాలా దారుణంగా ఉంది. మహామహా పెద్ద పత్రికలు సైతం కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. జాతీయ స్థాయిలో అనేక పత్రికలు మూతపడే ప్రమాదంలో ఉన్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే.. తెలుగు జర్నలిజానికి ఈనాడు ఓ బెంచ్ మార్క్. ఏ విషయంలో అయినా సరే ఈనాడు ట్రెండ్ సెట్ చేస్తుంది. మిగిలిన పత్రికలు దాన్ని ఫాలో అవుతాయి. అంతే. 1974 నుంచి అప్రతిహతంగా దూసుకుపోతున్న పత్రిక ఈనాడు.
మరి అంతటి చరిత్ర ఉన్న ఈనాడు తాను లేఆఫ్ నోటీస్ ఇస్తానని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ ఇచ్చింది. తన ఉద్యోగులకు పూర్తిస్థాయి ఉపాధి చూపించలేనని చేతులెత్తేసింది. ఎందరికి ఎన్నిరోజులు ఉపాధి ఉంటుందో చెప్పలేని స్థితిలో ఉంది. వార్తల విషయం ఎలా ఉన్నా.. ఈనాడు దిన పత్రిక వేతనాల విషయంలో తెలుగు మీడియాలోనే నెంబర్ వన్ అని చెప్పాలి. ఈనాడులో ఒకటో తారీఖు తర్వాత జీతం ఇవ్వడం అంటూ జరగదు. ఆ లోపే ఎక్కౌంట్లో జీతం పడిపోతుంది.
ఈనాడులో ఉద్యోగం అంటే ఇంచుమించు ప్రభుత్వ ఉద్యోగం అన్నంత భరోసా ఉండేది.. కానీ లాక్ డౌన్ ఈనాడును కూడా కుదేలు చేస్తోంది. ఓవైపు దారుణంగా పడిపోతున్న సర్క్యులేషన్. అసలు జనం పత్రికలు కొనేందుకు ముందుకురాని పరిస్థితి. మరోవైపు న్యూస్ ప్రింట్ భారం. మరోవైపు దారుణంగా పడిపోయిన ఆదాయం.. ఖర్చుకూ ఆదాయానికి మధ్య అగాధం పూడ్చలేని పరిస్థితుల్లో ఈనాడు తన గుడ్ విల్ ను కూడా పణంగా పెట్టాల్సి వస్తోంది.
ఇప్పుడు మీడియాలో ఒకటే చర్చ. ఈనాడు కూడా ఇలా చేస్తుందా.. కానీ సమస్య ఈనాడుది కాదు.. ప్రింట్ మీడియాది.. మరి ఈ కరోనా దెబ్బకు ప్రింట్ మీడియా తన ప్రభను శాశ్వతంగా కోల్పోనుందా.. లేక.. కరోనా కష్టాల నుంచి తేరుకుని మళ్లీ పునర్‌వైభవం పొందుతుందా.. పొందాలనే కోరుకుందాం.
మరింత సమాచారం తెలుసుకోండి: