భారత్ చైనా వివాదం : త్రివిధ దళాధిపతులతో రాజ్ నాథ్ కీలక చర్చలు... సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత...?
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో లడఖ్ లో తాజా పరిస్థితుల గురించి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాధిపతులతో చర్చలు జరిపారు. రాజ్ నాథ్ రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశం గురించి త్రివిధ దళాధిపతులతో చర్చించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజ్ నాథ్ సింగ్ వారం రోజుల్లో రెండోసారి సైనిక ఉన్నతాధికారులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ఇటీవల కాలంలో జ్రిగిన మేజర్ జనరల్ స్థాయి సంప్రదింపులపై కూడా చర్చ జరిగింది. జనరల్ బిపిన్ రావత్ రక్షణ మంత్రికి తూర్పు లడఖ్ లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో దళాల మోహరింపు గురించి వివరించారు. ఇప్పటికే భారత ప్రతినిధులు చైనా ప్రతినిధులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం ఇరు దేశాల రక్షణ దళాలు సరిహద్దు నుంచి వెనక్కి తగ్గాయి.
అయితే వెనక్కు తగ్గినట్టే తగ్గి చైనా తమ తమ సైనిక దళాలను సరిహద్దు వెంబడి మోహరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. చైనా సైనిక దళాలను మోహరించడంతో భారత్ కూడా సరిహద్దుల్లో దళాలను మోహరిస్తోంది. చైనా కుతంత్రాలను ఎదుర్కోవటానికి అప్రమత్తంగా ఉన్నట్లు భారత రక్షణ శాఖ చెబుతోంది. భారత్, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖలు శాంతియుతంగా పరిష్కరించడానికి సైనిక స్థాయిలో ఇరు దేశాలు దౌత్య చర్చలు జరుపుతున్నాయని తెలిపాయి.
సరిహద్దు రేఖ వెంబడి పహారా దళాల సంఖ్యను పెంచడంతో పాటు ఆయుధాలు, ఇతర సామగ్రిని కూడా భారత్ స్టాండ్ బై మోడ్ లో ఉంచింది. చైనా సైనిక స్థావరాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ భారత్ అదనపు దళాలను మోహరించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. సరిహద్దుల్లో తలెత్తే పరిస్థితిని పరిష్కరించడానికి ఇరుపక్షాల మధ్య దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.