ప్లీజ్ మ‌మ్మ‌ల్ని క‌ల‌వ‌డానికి రావొద్దు..  ప్ర‌జ‌ల‌కు ఓరుగ‌ల్లు నేత‌ల విన‌తి..ఏం జ‌రిగిందంటే...?

Spyder

 

క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌హా, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులంతా క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ‌ను ప్ర‌త్య‌క్షంగా క‌ల‌వ వ‌ద్ద‌ని ప్ర‌జల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే బాధ్య‌త త‌మ‌దేనంటూ, ఫోన్ల ద్వారా త‌మ‌ని, త‌మ సిబ్బందిని సంప్ర‌దించి ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. రౌండ్ ది క్లాక్ 24 గంట‌ల పాటు పోన్లలో నిరంత‌రం అందుబాటులో ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను స‌మీక్షించేందుకు స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. 

 

ఈ స‌మీక్ష‌లో పాల్గొన్న రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్క‌ర్, ఎంపీలు బండా ప్ర‌కాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, వ‌రంగ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ చింతా స‌దానందం త‌దిత‌రులు ఈ విష‌య‌మై ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. కెటిఆర్ చేయ‌నున్న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించిన సంద‌ర్భంతోపాటు, స‌మీక్ష స‌మ‌యంలోనూ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌ల‌వ‌డానికి స్థానిక నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. వాళ్ళ‌ని వారించ‌డం, ప్ర‌జాప్ర‌తినిధుల‌తోపాటు, పోలీసుల‌కు కూడా ఇబ్బందీగా మారింది. దీంతో ఎవ‌రినీ నొప్పించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ త‌రుణంలో స‌మీక్ష స‌మావేశం ముగింపులో ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో ప్ర‌జాప్ర‌తినిధులంతా ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. 

 

ఒక‌వైపు క‌రోనా విస్త‌రిస్తున్న త‌రుణంలో ఉభ‌య‌కుశ‌లోప‌రిగా, అటు ప్ర‌జ‌లు, ఇటు ప్రజాప్ర‌తినిధులు క్షేమంగా ఉండే విధంగా సామాజిక‌, భౌతిక దూరంతోపాటు, స్వీయ నియంత్ర‌ణ‌ను పాటించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం ఫోన్ల‌ల్లో అందుబాటులో ఉండాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని భావించారు. అలాగే త‌మ సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌‌రించాల‌ని, ఫోన్ల‌ల్లో వెంట‌నే స్పందించాల‌ని ఆదేశించారు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌ను అపార్థం చేసుకోవ‌ద్ద‌ని, ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండాల‌నేది త‌మ అభిమ‌తం కాద‌ని, అయితే, ఎవ‌రి వ‌ల్ల ఎవ‌రికి క‌రోనా సోకుతున్న‌ద‌న్న విష‌యం తెలియ‌ని ఆయోమ‌యం నెల‌కొన్న‌ద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో అంతా క్షేమంగా ఉండాల‌నేదే త‌మ అభిమ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: