నకిలీ హ్యాండ్ శానిటైజర్లతో తస్మాత్ జాగ్రత్త !

NAGARJUNA NAKKA

నకిలీ హ్యాండ్ శానిటైజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అసాంఘిక శక్తులు అత్యంత విషపూరితమైన మిథనాల్ ఉపయోగించి నకిలీ హ్యాండ్ శానిటైజర్లు తయారు చేస్తున్నాయంటూ అప్రమత్తం చేసింది.

కరోనా కష్టకాలంలోనూ...కొందరు వ్యాపారులు నీచానికి పాల్పడుతున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. కొవిడ్-19 పరికరాల పేరుతో ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతోందని.. దీనికి సంబంధించి ముందస్తు చెల్లింపులు కూడా చేశారని సీబీఐ సంచనల వాస్తవాలను బయటపెట్టింది. ఈ ఆన్‌లైన్ చెల్లింపులపై అన్ని రాష్ట్రాలను సీబీఐ అప్రమత్తం చేసింది. శానిటైజర్లలో ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారని తెలిపింది.  అన్ని రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్‌పోల్ భారత్‌ను అప్రమత్తం చేసిందని చెబుతోంది సీబీఐ.

కొవిడ్ పరికరాలు కొనుగోలు చేసే ముందు ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది సీబీఐ. అక్రమార్కులు ఆన్‌లైన్‌లో ముందస్తుగానే నగదు చెల్లింపులు చేసుకొని .. ఆ తర్వాత.. శఠగోపం పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా సరకులు బుక్ చేసుకున్న వారిలో చాలా మందికి అవి డెలివరీ కావట్లేదని గుర్తించింది.

సైబర్ నేరగాళ్లు ఆర్డర్లు చేయించుకొని కస్టమర్లను మోసం చేస్తున్నన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదకరమైన రసాయనాలతో  తయారవుతున్న శానిటైజర్లను ఉపయోగించడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని సీబీఐ హెచ్చరించింది. శానిటైజర్ తయారీ సంస్థలపైన అధికారులు దృష్టి సారించాలని సూచించింది.

మరి కొంత మంది.. ఆస్పత్రుల్లో రక్షణ పరికరాల కొరతని ఆసరా చేసుకుని యాజమాన్యాలకు మోసగిస్తున్నాయని కూడా హెచ్చరించింది. కంపెనీ ప్రతినిధులమని నమ్మబలుకుతూ కొందరు వ్యక్తిగత రక్షణ దుస్తులు సరఫరా చేస్తామని ఆస్పత్రుల నుంచి పెద్ద ఎత్తున ఆన్‌లైన్ ఆడ్వాన్సులు తీసుకుంటున్నారని, ఆ తరువాత అంతులేకుండా పోతున్నారని సీబీఐ తెలిపింది. ఇటువంటి వారి విషయంలో రాష్ట్రాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది సీబీఐ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: