మండలిలో యుద్ధం: మంత్రిని తన్నిన టీడీపీ ఎమ్మెల్సీ..రచ్చ రచ్చ..?

Chakravarthi Kalyan
ఏపీ మండలిలో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో వైసీపీ - టీడీపీ నేతల తీరుతో మరోసారి రణరంగం అయ్యింది. టీడీపీకి మెజారిటీ ఉండటంతో తమ ప్రతాపం చూపుతోంది. ఈ దీమాతోనే బిల్లులను అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. స‌భ సాంప్రదాయాల‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రిస్తూ మండ‌లిలో ప్రతిప‌క్షం హడావుడి చేస్తోందంటోంది.

నిన్న మరోసారి మండలిలో ప్రతిష్టంభన నెలకొంది. బిల్లుల ఆమోదంపై మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రుల మధ్య వాగ్వాదం నడిచింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి చేద్దామని మండలి డిప్యూటీ చైర్మన్ చెప్పగా.. మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సీఆర్డీయే రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ముందుగా చేపట్టాలని మంత్రి కోరారు. ద్రవ్యవినిమయ బిల్లు రాజ్యాంగ ఆబ్లిగేషన్‌ అని యనమల రామకృష్ణుడు అడ్డుతగిలారు. అది అయ్యాక మిగిలిన బిల్లులపై ఆలోచిద్దామని చెప్పారు.

యనమల వ్యాఖ్యలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు చివరిగా చేపట్టడం సంప్రదాయం అని బుగ్గన స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని నిలదీశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ 15 నిమిషాలు మండలిని వాయిదా వేశారు. మండలి నిరవధిక వాయిదా పడిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ సభ్యుడు బీద రవిచంద్రయాదవ్‌ మధ్య ఉద్రిక్తత తలెత్తింది. మంత్రిని బీద రవిచంద్ర కాలితో తన్నారని వైకాపా సభ్యులు, మంత్రులు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ వైపు వెలంపల్లి దూసుకొస్తుంటే నిలువరించామని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ సభ్యులు తమను అసభ్య పదజాలంతో దూషించారని తెదేపా సభ్యులు ఆరోపించారు. టీడీపీ, వైసీపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: