బాబుని ఒంటరి చేయడమే లక్ష్యమా ? వారెక్కడ ?
వైసీపీ అధినేత ఏపీ సీఎం వేస్తున్న రాజకీయ అడుగులు సీనియర్ నాయకులకు సైతం అంతుపట్టని విధంగా ఉన్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించడంలో జగన్ బాగా రాటుదేలారు. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా దెబ్బకొట్టాలో జగన్ కు బాగా అర్థం అయిపోయింది. ప్రస్తుతానికి తనకు ఉన్న ఏకైక ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసి ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఒంటరిని చేయాలంటే, చుట్టూ ఆయనకు అండగా నిలబడుతున్న అందరిని దూరం చేయాలనే విషయాన్ని జగన్ గ్రహించాడు. అందుకే ఎక్కడా చంద్రబాబు జోలికి కాని, ఆయన కుమారుడు నారా లోకేష్ జోలికి కాని, వెళ్లకుండా చుట్టూ ఉన్న బలమైన నాయకులందరినీ దూరం చేసే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టి నట్టుగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో జైలుకు వెళ్లారు. అచ్చెన్న వ్యవహారం చూస్తుంటే 2016 నుంచి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. అన్ని విషయాల్లోనూ, చేదోడువాదోడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. అడుగడుగునా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అసెంబ్లీలోనూ అదే స్థాయిలో రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చుట్టూ జగన్ అనేక ఉచ్చులు పన్నుతున్నారు. టిడిపి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా తీవ్ర బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు సైతం వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో లో 2017 -18 మధ్య ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేశామని రికార్డు లు చూపించారు.
కానీ ఆ పాఠశాలలకు రంగులు వెలిసిపోయి ఉండడంతో దీనిపై వైసీపీ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా, లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇక అప్పట్లో పురపాలక మంత్రిగా మాజీ మంత్రి నారాయణ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ లో ఆయన ఉన్నారు. అందుకే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా ఆయన స్పందించడం లేదు. ఒక దశలో ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి.
ఇదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో వ్యవహరించిన పత్తిపాటి పుల్లారావు పై అప్పట్లో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన సతీమణి వెంకాయమ్మ నకిలీ పురుగు మందుల దుకాణాలను ప్రోత్సహించి, భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లో వైసిపి చేసింది. అంతే కాకుండా ఇంకా అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో దీనిపైన వైసీపీ ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఇలా వరుసగా చంద్రబాబుకు సన్నిహితులైన వారందరినీ వైసిపి టార్గెట్ చేసుకోవడంతో వారంతా పార్టీకి దూరం దూరం గానే ఉంటున్నట్టు గా కనిపిస్తున్నారు.