ఎవరినీ వదలను ... అందరి సరదా తీర్చేస్తానంటున్న జగన్ ?

గతాన్ని పక్కనపెడితే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ లో ఎక్కడలేని మార్పు కనిపిస్తుంది. తనపై నమ్మకంతో ఓటు వేసిన వైసిపికి అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలని, వారి బాధలు, కష్టాలు, కన్నీళ్లు తీర్చాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ జనరంజక పాలన ఎలా ఉంటుందో చూపిస్తూ, దివంగత రాజశేఖర్ రెడ్డి పరిపాలన మరిపించే విధంగా జగన్ అన్ని విషయాల్లోనూ తనను తాను నిరూపించుకుంటున్నారు. తాను ఈ స్థాయిలో ప్రజలకు మంచి చేస్తున్నా, తన రాజకీయ ప్రత్యర్థులు ,కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్న తీరుతో జగన్ మొదటి నుంచి ఆగ్రహం గానే ఉన్నారు. కేవలం సామాజిక వర్గాల లెక్కల ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని విలన్లుగా చిత్రీకరిస్తూ వస్తున్న ఓ వర్గం మీడియా పైన జగన్ కన్నేసి ఉంచారు. 


ముఖ్యంగా ఓ రెండు పత్రికల విషయంలో జగన్ సీరియస్ గానే ఉంటున్నారు. ఆ రెండు పత్రికలు అనేమాట ఇప్పటిది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి పదే పదే ఆయన ఆ రెండు పత్రికలు అంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై మాట్లాడేవారు. కానీ జగన్ మాటలు మనిషి కాదు చేతల మనిషి. ఏదైనా చేసి చూపిస్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 2430 ని తీసుకువచ్చారు. ఈ జీవో పై హైకోర్టు లోనూ జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ జీవో ప్రకారం సరైన సమాచారం లేకుండా, నిరాధారంగా వ్యక్తుల పరువుకు భంగం కలిగించే వార్తను ప్రచురించినా , ప్రచారం చేసినా, సదరు మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వడం, అవి స్పందించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంలోనూ ప్రభుత్వం జీవో నెంబర్ 2430 తీసుకొచ్చింది.


 దీనిపై పిటిషన్ దాఖలైన ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అదే పనిగా తనపై విమర్శలు వస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీ రావుపై ఎప్పటి నుంచో జగన్ ఆగ్రహం గానే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మేలు చేసే విధంగా కథనాలు వండి వార్చుతూ  ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచురిస్తూ వస్తుందన్న అభిప్రాయంతో ఎప్పటి నుంచో ఈ రెండు పత్రికల పైన నిఘా పెట్టారు. తాజాగా జీవో నంబర్ 2430 ప్రకారం ఇప్పుడు ఆమోద పబ్లికేషన్స్ ఆంధ్రజ్యోతి, ఉషోదయ పబ్లికేషన్స్ ఈనాడు కు  రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది నోటీసులు అందించారు. ప్రభుత్వం సరైన సమాచారం లేకుండా ప్రచురించారని, 15 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, అలా కాని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు. 

 


తప్పుడు కథనాలకు సంబంధించి ఆ పత్రిక స్పందించిన తీరు సంతృప్తికరంగా లేకపోవడంతో, ఇలా నోటీసులు జారీ చేసింది. కేవలం ఈ రెండు పత్రికలే కాకుండా ఇప్పటికే ఓ టీవీ చానల్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తోంది. నిత్యం ఆ మీడియా సంస్థ యజమాని తో పాటు, డిబేట్ యాంకర్ ను పోలీసులు విచారణ చేస్తూ వస్తున్నారు. మొత్తంగా ఎవరు తేడాగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమని, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: