సూర్య గ్రహణం : గ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే తెరిచి ఉంటుంది... ఎందుకంటే....?

Reddy P Rajasekhar

సాధారణంగా గ్రహణం రోజున దేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారనే సంగతి తెలిసిందే. అయితే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణం రోజున తెరిచే ఉంటుంది. అయితే ఈ ఆలయం మాత్రమే తెరిచి ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఈరోజు ఆలయంలో స్వామివారికి పూజలు జరుగుతాయి. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. 
 
రాహు కేతువులకు పూజలు నిర్వహించడంతో పాటు గ్రహణం రోజున పూజలు చేస్తే దోషం పోతుందని భక్తులు బలంగా నమ్ముతారు. పురాణాల ప్రకారం స్వామి కవచంలో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు ఉంటాయి. పురాణాలు సౌర వ్యవస్థ మొత్తం ఆయన నియంత్రణలో ఉంటుందని చెబుతున్నాయి. గ్రహణంతో వచ్చే అరిష్టాలు ఇక్కడ పని చేయవని భక్తులు బలంగా విశ్వసించడంతో ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. 
 
ఈరోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలను కూడా గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాల్లో గ్రహణం కనిపించనుంది. ఉత్తర భారతదేశంలో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 10.25 గంటలకు గ్రహణం ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 12.08 గంటలకు సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించనుంది. శాస్త్రవేత్తలు ఈ సూర్య గ్రహణం తరువాత మరో గ్రహణాన్ని వీక్షించాలంటే ఒక దశాబ్దం పడుతుందని చెబుతున్నారు. 
 
గ్రహణం ఏర్పడే సమయంలో కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించే వారు కొన్ని నియమాలను పాటించాలి. శాస్త్రవేత్తలు గ్రహణం ప్రారంభానికి ముందే అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రహణ ప్రారంభానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇష్ట దైవాన్ని జపించాలని చెబుతున్నారు. ఆకాశంలో నేడు వలయాకార సూర్య గ్రహణం ఏర్పడనుంది. శాస్త్రవేత్తలు సూర్య గ్రహణాన్ని నేరుగా చూడకూడదని ప్రత్యేక పరికరాల ద్వారా మాత్రమే చూడాలని చెబుతున్నారు.                            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: