ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? జనాల్లోకి రా పవన్ ?

రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తున్నారు అనే అనుమానాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. దీనికి ఆయన వ్యవహారశైలి కూడా కారణంగా కనిపిస్తోంది. ఒకసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత, అందులోనూ సొంతంగా పార్టీని స్థాపించిన వారు నిత్యం, ప్రజల్లోనే ఉంటూ, ఏదో ఒక అంశం పై పోరాటాలు చేస్తూ, ప్రజల పక్షాన నిలిచి వారి గొంతుగా మారి ప్రభుత్వాన్ని నిలదీయడం, అధికారంలో ఉన్న వారైతే, ప్రజా పరిపాలన పై దృష్టి పెట్టడం వంటివి చేయాలి. అలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాం ఎప్పుడూ అంటే కుదరదు అన్నట్టుగా వ్యవహరిస్తే, కుదరని పని. రాజకీయంగా సక్సెస్ సాధించాలని కోరుకునే వారు ఎవరు ఆ విధమైన పొరపాట్లు చేయరు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇది అర్ధం అవుతుంది. 

 


2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకపోయినా,  బీజేపీ, టీడీపీ కూటమి  అధికారంలోకి వచ్చేందుకు పవన్ గట్టిగానే ప్రయత్నించారు. ప్రచారమూ చేశారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో టిడిపి, వైసిపి, బిజెపిలకు వ్యతిరేకంగా పవన్ బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లినా, కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గంలో ఓటమి చెందారు. ఇక ఓటమి నేర్పిన గుణ పాఠం నుంచి పవన్ ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ, ఇప్పుడు సినిమాలపైనా, రాజకీయాలపైనా రెండు పడవల మీద కాళ్ళు పెడుతూ, దేని మీద పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు.


 ఇప్పుడు ఏపీలో అనేక రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం వైసిపి, బిజెపి ఎవరికి వారు పైచేయి సాధించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ కీలక సమయంలో పవన్ మౌనంగా ఉండిపోవడం, కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే విధంగా ప్రయత్నించకపోవడం కింది స్థాయి కార్యకర్తల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. పవన్ ఇప్పటికైనా, ఇల్లు వదిలి బయటకు వచ్చి పార్టీ పై దృష్టి పెట్టాలని, లేకపోతే 2024 ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని, ఇక అప్పుడు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అని పవన్ పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: