కరోనాతో కుదేలైన నిర్మాణ రంగం.... విజయవాడలోనే నిలిచిపోయిన 20 వేల అపార్టుమెంట్లు....?

Reddy P Rajasekhar

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా దెబ్బకు చాలా రంగాలు కుదేలవుతున్నాయి. అలా కుదేలైన వాటిలో స్థిరాస్థి రంగం కూడా ఒకటి. వైరస్ విజృంభణ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వాళ్లు ఫ్లాట్ లు, స్థలాల క్రయవిక్రయాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నిపుణులు కరోనా తర్వాత ప్రజల ఆలోచనల్లో సైతం మార్పు వచ్చిందని.... గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లు, ఫ్లాట్లపై వాళ్లు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల లోపు కట్టే ఫ్లాట్ లకు గిరాకీ పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. కొనుగోలుదారుల్లో నమ్మకం కుదిరి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే మరలా నిర్మాణ రంగం పుంజుకుంటుందని తెలుపుతున్నారు. 
 
కేవలం విజయవాడలోనే కరోనా, లాక్ డౌన్ వల్ల 20 వేల అపార్టుమెంట్ల పనులు నిలిచిపోయాయంటే నిర్మాణ రంగం పరిస్థితి సులభంగానే అర్థమవుతుంది. ప్రజలు ప్రస్తుతం ఆరోగ్యం, భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభమైనా కార్మికుల కొరత ఈ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. రెరా నిబంధనల నుంచి ఏడాదిపాటు సడలింపులు ఇవ్వాలని నిర్మాణాలకు గ్యారంటీ ఇవ్వగలమని వాళ్లు చెబుతున్నారు. 
 
కరోనాతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని..... మార్కెట్ విలువల పెంపును కొంతకాలం వాయిదా వేయడంతో పాటు జీఎస్టీలోను కొంత వెసులుబాటు ఇవ్వాలని నిర్మాణ రంగానికి చెందిన వారి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ధరలు తగ్గే అవకాశం లేదని.... వర్క్ ఫ్రం హోం వల్ల ఫ్లాట్ లకు గిరాకీ పెరుగుతుందని.... రెండు మూడు నెలల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: