కరోనా విజృంభిస్తోంది. హైదరాబాద్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా రోగులకు వైద్యం అందించేందుకు సౌకర్యాలు కరవవుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా కరోనా లక్షణాలతో ఉండి... ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లలేక ప్రైవేటును ఆశ్రయిద్దామని ప్రయత్నిస్తే ఫలితం శూన్యంగానే ఉంటోంది.
ఎందుకంటే.. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం కష్టమవుతోంది. మూణ్నాలుగు రోజుల వరకూ నమూనాలను స్వీకరించలేమంటున్నారు. పెద్దస్థాయిలో పైరవీలు చేయించుకుంటే తప్ప పనులు కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక పదవులు నిర్వహించిన ఓ రిటైర్డ్ ఆఫీసర్ కు కరోనా వస్తే.. చివరకు ఓ ఉన్నతస్థాయి అధికారితో ఫోన్ చేయించుకుంటే కానీ బెడ్ దొరకలేదు.
మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి తెర తీస్తున్నాయి. మిగిలిన రోగులకు కరోనా పాజిటివ్ కాకపోతేనే చేర్చుకుంటామంటున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షలకిస్తే ఫలితం రావడానికి కనీసం 48 గంటలు పడుతోంది. నెగెటివ్ వస్తే అసలే సమాచారమూ తెలియదు. కాబట్టి ప్రైవేటులో చేర్చుకోవడం లేదు.
మరోవైపు కరోనా రోగుల విషయంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలపై పారదర్శకత కనిపించడం లేదు. ఏ ఆసుపత్రిలో ఎంతమంది అనుమానితులను చేర్చుకున్నారు? వారిలో ఎందరికి కరోనా పరీక్షలు చేశారు? వాటి ఫలితాలు ఏమిటి? ఐసోలేషన్, ఐసీయూ, వెంటిలేటర్‌తో కూడిన పడకలెన్నెన్ని ఉన్నాయి? వాటిలో ఏ విభాగంలో ఎందరెందరు చికిత్స పొందుతున్నారు? ఇంకా ఏ విభాగంలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయి? అన్న సమాచారం లభించడం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: