ఇప్పటికే వరుసగా షాకుల మీద షాకులు తింటున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఓ మాజీ మంత్రి, ఓ మాజీ ఎమెల్యే అరెస్టయి జైళ్లో ఉండగా.. ఇప్పుడు మరో మాజీ మంత్రి కూడా జైలు ఊచలు లెక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీ పట్నానికి చెందిన ఈయన్ను తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం జాతీయ రహదారిపై అరెస్టు చేశారు.
ఇటీవల మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య విషయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయంపై వార్తలు వచ్చాయి. ఆయన హస్తం ఉందని మోకా భాస్కరరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ కేసులో కొల్లు ఇరుక్కుంటాడేమోనని రెండు రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఊహించినట్టే.. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా చేర్చడంతో ఆయన అలర్టయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇవాళ ఆయన ఇంటికి రెండు, మూడు సార్లు పోలీసులు వెళ్లినా ఆయన ఇంట్లో లేకుండా వెళ్లిపోయారు. చివరకు ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారని... ఆయన కోసం మూడు బృందాలతో గాలిస్తున్నామని సాయంత్రం పోలీసులు ప్రకటించారు.
ఇక పోలీసుల విచారణలో కొల్లు రవీంద్ర విశాఖ జిల్లా వైపు వెళ్తున్నట్టు గమనించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో కాపు కాసిన మఫ్టీలోని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే తాను హత్య చేసినట్టు నిందితుడు ఇప్పటికే చెప్పినట్టు పోలీసులు అంటున్నారు. దీన్ని నిరూపించగలిగితే కొల్లు రాజకీయ జీవితానికి శూన్యం అయ్యే ప్రమాదం ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: