నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్..... రైల్వే కొలువులు ఇప్పట్లో లేనట్లే....?
దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కరోనా ప్రభావం రైల్వే శాఖపై పడింది. రైల్వే శాఖ తాజాగా నిరుద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. రైల్వే శాఖ భద్రతకు సంబంధించిన ఉద్యోగాలకు మినహా మిగతా అన్ని ఉద్యోగాలకు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కొత్త నోటిఫికేషన్లను చేపట్టవద్దంటూ రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
బోర్డ్ జాయింట్ డైరెక్టర్ అజయ్ ఝా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉన్న ఉద్యోగులను మాత్రం ఎవరినీ తొలగించబోమని అన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నియామక ప్రక్రియలు యథావిథిగా కొనసాగుతాయని వ్యాఖ్యలు చేశారు. భద్రతా విభాగంలో 72,274 ఉద్యోగ ఖాళీలు ఉండగా మిగిలిన వాటిలో 68,366 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుతం 1,40,640 ఖాళీలు ఉన్నాయి. రైల్వే శాఖ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొత్త ఉద్యోగ ప్రకటనలు ఉండవని పేర్కొంది.
కరోనా విజృంభణ వల్ల గతంతో పోలిస్తే రైల్వే శాఖకు 58 శాతం ఆదాయం తగ్గింది. దీంతో రైల్వే శాఖ ఉపశమన చర్యలకు సిద్ధమైంది. రైల్వే శాఖ ఆదాయాల పెంపునకు, వ్యయ నియంత్రణ కొరకు నూతన ఆదాయ మార్గాలను అన్వేషించనుంది. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలు, కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టులకు రైల్వే శాఖకు ఉద్యోగులు కావాల్సి ఉంది.
దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతం 80,525 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 95,666 మంది సిబ్బంది అవసరం ఉంది. 15,000 ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్ర నష్టం కలగనుంది. రైల్వే శాఖ కొత్త పోస్టుల భర్తీని నిలిపివేస్తూ... ఖర్చులను తగ్గించుకుంటూ.... డిజిటల్ ప్లాట్ ఫాంలను ఎక్కువగా వినియోగించుకోవాలని రైల్వే శాఖలోని ఆర్థిక విభాగం అన్ని జోన్లకు సూచనలు చేయనుంది.