ఆ రెండు బెర్త్ లు ఎవరివి.. ?

NAGARJUNA NAKKA

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఖాళీ అవుతున్న రెండు బెర్త్‌లు ఎవరిని వరించనున్నాయి? సామాజిక వర్గాల సమీకరణలా? అనుభవానికి పెద్దపీటా? జిల్లా ఈక్వేషన్‌ కూడా ఉంటుందా? ఈ అంశాలపై వైసీపీలో చర్చ జరుగుతోంది. 

 

సుమారు ఏడాది కిందట అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం జగన్‌ చేసిన మంత్రివర్గ కూర్పు అందరి అంచనాలు, లెక్కలను తలకిందులు చేసింది. అనిల్‌ కుమార్‌ యాదవ్ వంటి పెద్దగా అనుభవం లేని వాళ్ళకు సాగు నీటి వంటి కీలక శాఖలు దక్కాయి. మంత్రిపదవి ఖాయం అనే విపరీతంగా ప్రచారం జరిగిన రోజా, శ్రీకాంత్‌ రెడ్డి లాంటి వారికి బెర్తు దొరకలేదు. త్వరలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి చోటు దొరుకుతుంది అన్న ఉత్కంఠ వైసీపీ నేతల్లో ఉంది. బీసీ కోటాలో బెర్త్‌ ఖాయం అనుకుంటున్న జోగి రమేష్‌ లాంటి వారికి అప్పుడే మంత్రి కళ వచ్చేసిందంటూ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 



ఖాళీ అయిన రెండు స్థానాలు బీసీ వర్గాలు శెట్టి బలిజ, మత్స్యకార కావటంతో తిరిగి ఆ సమీకరణలోనే భర్తీ చేస్తారని ఒక వర్గం నమ్ముతోంది. రాజ్యసభకు పంపించారు కనుక వారి కోటా అయిపోయినట్లేనని, బీసీల్లోనే మిగిలిన వర్గాలకు చోటు ఇవ్వటమే న్యాయం అని మరికొందరు లెక్కలు తీస్తున్నారు. ఈ సమీకరణ పైనే దృష్టి పెడితే ఆ యా జిల్లాలకు మంత్రివర్గంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సామాజిక వర్గ ఈక్వేషన్‌లో మార్పు చేయక తప్పదు. ఇవే కాకుండా జగన్‌ గతంలో మంత్రివర్గంలోకి తీసుకుంటాను అని హామీ ఇచ్చిన రిజర్వుడ్‌ కోటాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఏం చేస్తారనే అంశం కూడా తేలాల్సి ఉంది. 

 

శాఖల పరంగా కీలకమైన విషయాన్ని కూడా సీఎం చూడాల్సి ఉంది. ఖాళీ అయిన శాఖల్లో ఒకటి మత్స్య, పశువర్ధక శాఖ కాగా, మరోకటి కీలకమైన రెవెన్యూ శాఖ. సాధారణంగా రెవెన్యూ వంటి పెద్ద శాఖలను జూనియర్‌ మంత్రులకు కేటాయించరు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వారికే కేటాయిస్తుంటారు. క్యాస్ట్‌ ఈక్వేషన్‌లో చూస్తే అనుభవం ఉన్న వారు లేరు. అప్పుడు కొత్తగా మంత్రివర్గంలోకి వస్తున్న ఒకరికి కచ్చితంగా చిన్న శాఖ కేటాయించి మరోకరికి ఇప్పటికే వేరే మంత్రి దగ్గర ఉన్న చిన్న శాఖను సర్దు బాటు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ రెవెన్యూ శాఖను సీనియర్‌ మంత్రికి అప్పజెప్పాల్సి వస్తుంది. అంటే సామాజికవర్గం, జిల్లాలే కాకుండా శాఖల కేటాయింపులో కూడా జగన్‌కు కీలక కసరత్తే చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నీ ఎలా తేలుస్తారో, అధినేత మనసులో ఏముందో అని నేతలు మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: