భారత్ లోని కరోనా వైరస్ కు ఎన్ని రూపాలు ఉన్నాయో తెలుసా....?
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ వైరస్ కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఊసరవెల్లిని మించి రూపాలను మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. శాస్త్రవేత్తలు కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సమయంలో జన్యుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని గతంలో పరిశోధనల్లో తేలింది.
అయితే వివిధ రాష్ట్రాల్లోని వైరస్ జన్యుక్రమాలను(జీనోమ్) విశ్లేషించిన శాస్త్రవేత్తలు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. సీసీఎంబీ వర్గాలు ఇప్పటివరకు దేశంలో 2,441 కరోనా వైరస్ రూపాంతరాలను గుర్తించినట్లు తెలిపాయి. అధికారులు 1,468 నమూనాల నుంచి సేకరించిన జన్యుక్రమాలను విశ్లేషించి ఈ వివరాలను ప్రకటించారు. ఊసరవెల్లి కంటే వేగంగా వైరస్ తన జన్యుక్రమాన్ని మార్చుకుంటోంది.
కరోనా నిర్మాణంలోని స్వల్ప మార్పుల ఆధారంగా శాస్త్రవేత్తలు వైరస్ లను కొన్ని సమూహాలుగా విభజించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పదికిపైగా కరోనా వైరస్ సమూహాలు వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఏ2ఏ రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఏ2ఏ రకానికి చెందినవే అని సమాచారం. మొదట్లో రాష్ట్రంలో ఏ3ఐ రకం వైరస్ ఎక్కువగా కనిపించింది.
అయితే మే తొలివారంనుంచి ఏ2ఏ రకం వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. సీసీఎంబీ కరోనా జన్యుక్రమాలపై జరుగుతున్న పరిశోధనలను ఏకతాటిపైకి తెచ్చేందుకు జీనోమ్ ఎవల్యూషన్ ఎనాలసిస్ రిసోర్స్ ఫర్ కొవిడ్-19 (గేర్-19) పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 19కు పైగా రాష్ట్రాల్లో, 35 ల్యాబ్‌లలో జరుగుతున్న పరిశోధనల ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.