గుడ్ న్యూస్ః మూడు నెల‌ల్లో క‌రోనా టీకా

Pradhyumna

ఇప్పుడంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్‌పైనే. ప్రపంచ వ్యాక్సిన్‌ అవసరాల్లో 2/3 శాతం భారతే తీరుస్తున్నదని, కరోనా టీకాను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడంలో కూడా భారత్‌ కీలకపాత్ర పోషించబోతున్నదని ప్రధాని మోదీ గురువారం జరిగిన ‘గ్లోబల్‌ వీక్‌-2020’లో వ్యాఖ్యానించడం ద్వారా అంద‌రి చూపు భార‌త‌దేశంపైనే ప‌డింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధిచేసిన ‘కొవాగ్జిన్‌'ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఇటీవలే భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) ఆదేశించిన నేప‌థ్యంలో...మ‌న న‌గ‌రం నుంచే వ్యాక్సిన్ రానుంద‌నే భ‌రోసా క‌లిగింది. అయితే, త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ రానుంద‌నే ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

కొవాగ్జిన్‌ను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తేవాలంటూ ఐసీఎంఆర్‌ ఈ నెల 2న భాగస్వామ్య సంస్థలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. గ‌డువు పెట్టి వ్యాక్సిన్‌ తయారు చేయాలనడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆగస్టు 15 కాకపోయినా దసరా నాటికి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం రూపొందించినట్టు తెలిసింది.

 


సాధారణంగా ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఫేజ్‌-3కి 6 నెలల నుంచి కొన్నేళ్లు పట్టవచ్చని అంటున్నారు. అయితే ఇందులో ప్రయోగదశలకన్నా.. వాటిని రికార్డు చేయడం, పై అధికారులకు పంపడం, అనుమతుల కోసం ఎదురుచూడటం.. ఇలా పేపర్‌వర్క్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ‘పేపర్‌వర్క్‌'ను తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. వెంట వెంటనే అనుమతులు ఇస్తే.. కనీసం 2-3 నెలల సమయం తగ్గుతుందని భావిస్తున్నది. తద్వారా మూడు నెలల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవొచ్చని యోచిస్తున్నట్టు సమాచారం. మరో ఆరునెలల్లో సురక్షిత కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధిచేస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో సీరమ్‌ పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: