అన్ లాక్ 2.0 : హైదరాబాద్ వాసులకు శుభవార్త.... నగరంలో తగ్గుముఖం పడుతున్న కరోనా....?

Reddy P Rajasekhar

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 33,402కు చేరింది. గత 24 గంటల్లో 1,714 మంది కోలుకుని డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 20,919కు చేరింది. 
 
గత 24 గంటల్లో 9 మంది వైరస్ భారీన పడి మృతి చెందగా కరోనా మృతుల సంఖ్య 348కు చేరింది. నిన్న నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 736 కేసులు మాత్రమే నమోదయ్యాయి. నగరంలో కరోనా తగ్గుముఖం పట్టడం ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. మూడు రోజుల క్రితం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. ఒక దశలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు దేశంలో కరోనా విజృంభణ ఆందోళనకర స్థాయిలో ఉంది. గత 24 గంటల్లో దేశంలో 27,114 కేసులు నమోదయ్యాయి. కేవలం నాలుగు రోజుల్లో భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు చేరింది. 
 
దేశంలో కరోనా రికవరీ రేటు 62.78 శాతంగా ఉండగా మృతుల సంఖ్య 22,213కు చేరింది. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 7,862 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా మరణాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: